Karimnagar: కరీంనగర్‌లో గంగులకు తిప్పలు తప్పవా? పోటీకి సై అంటున్న ఎంఐఎం.. అసలేం జరుగుతోంది?
Karimnagar News: కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ను టార్గెట్ చేసింది ఎంఐఎం. అంతేకాదు.. విమర్శలు, ప్రతి విమర్శలతో కరీంనగర్‌ను హీటెక్కించేస్తున్నారు. దిష్టిబొమ్మలను దహనం చేసుకునే వరకు వెళ్లింది మ్యాటర్. ఇప్పటికీ ఈ గొడవ చల్లారడం లేదు. ఈ రెండు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.

-
కరీంనగర్లో గంగుల కమలాకర్, ఎంఐఎం మధ్య విభేదాలు..
-
పోటికీ రెడీ అంటున్న ఎంఐఎం..
-
ఇప్పటికే ఇరు పార్టీల మధ్య విమర్శల వేడి..
కరీంనగర్, జులై 19: కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ను టార్గెట్ చేసింది ఎంఐఎం. అంతేకాదు.. విమర్శలు, ప్రతి విమర్శలతో కరీంనగర్‌ను హీటెక్కించేస్తున్నారు. దిష్టిబొమ్మలను దహనం చేసుకునే వరకు వెళ్లింది మ్యాటర్. ఇప్పటికీ ఈ గొడవ చల్లారడం లేదు. ఈ రెండు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కరీంనగర్ నియోజకవర్గం నుంచీ పోటీ చేస్తామని ఎంఐఎం నేతలు ప్రకటిస్తున్నారు. బిఆర్ఎస్ మాత్రం ఎవరూ పోటీ చేసినా విజయం తమదేననే ధీమాలో ఉంది.
కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో సుమారుగా 50 వేయిలకు పైగా ముస్లిమ్ మైనారిటీ ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లే.. గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. అయితే, మొదటి నుంచీ గంగుల కమలాకర్ వెంటే మైనారిటీలు ఉన్నారు. 2009 నుంచి 2018 ఎన్నికల వరకు అధికంగా మైనారిటీ ఓట్లు ఆయనకే పడుతున్నాయి. 2018 ఎన్నికల్లో దాదాపు 85 శాతం మైనారిటీలు కారు గుర్తుకు ఓటేశారు. దీంతో బీజేపీ అభ్యర్థి సంజయ్ గట్టి పోటీ ఇచ్చినా గెలువలేకపోయారు. అయితే, ఇటీవల 50 సీట్లలో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించిన నేపథ్యంలో కరీంనగర్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అహ్మద్ హుస్సేన్ బీఆర్ఎస్‌తో పాటు మంత్రి గంగుల కమలాకర్‌ను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు.
దీంతో బీఆర్ఎస్ మైనారిటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఆహ్మద్ హుస్పేస్ దిష్టిబొమ్మను దహనం చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇలా రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరింది. మైనారిటిలతో పాటు ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. దాంతో తాము పోటీ చేస్తే.. గట్టి పోటి ఇస్తామని ఎంఐఎం భావిస్తుంది. గత ఎన్నికల్లో గంగుల కమలాకర్‌కు ఎంఐఎం మద్దతు ఇచ్చింది. ఇప్పుడు.. ఓట్లు పెరగడంతో పోటికి సై అంటోంది. మైనారిటీ ఓట్లన్నీ తమకే పడే అవకాశం ఉందని ఎంఐఎం భావిస్తుంది. పట్టు ఉన్న డివిజన్‌లో పార్టీ బలోపేతం కోసం ఎంఐఎం దృష్టి పెట్టింది.




అయితే, ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారు. ఎంఐఎంకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దని తమ పార్టీ మైనారిటీ విభాగం నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ అడ్డాలో కాస్త నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. అయితే, ఎన్నికల వరకు ఈ వాతవరణం ఇలాగే ఉంటుందా? లేక మరింత రచ్చ చేస్తుందా? అనేది వేచి చూడాలి. అయితే, ప్రస్తుతానికి గంగులను ఓడించి తీరుతామని భీష్మించిన ఎంఐఎం.. తరువాత మనసు మార్చుకునే అవకాశాలు ఉన్నాయని కూడా అంచనా వేస్తున్నారు. అలా కాకుండా ఎంఐఎం దూకుడుగా వ్యవహరిస్తే మాత్రం బీఆర్ఎస్‌కు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా గంగుల కమలాకర్‌కు గడ్డు పరిస్థితులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..