Hyderabad: దేశంలోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్! మన హైదరాబాద్‌లో ఎక్కడంటే..?
తెలంగాణ ప్రభుత్వం రూ.1901 కోట్లతో హైదరాబాద్ శివార్లలో 199 ఎకరాల్లో అత్యాధునిక పండ్ల మార్కెట్ నిర్మించనుంది. ఇందులో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, కోల్డ్ స్టోరేజీలు, రిటైల్ జోన్లు, పార్కింగ్, వ్యాపార సంస్థలకు స్థలం లభిస్తుంది. ప్రస్తుత మార్కెట్‌లోని రద్దీని తగ్గించి, పండ్ల ఎగుమతి, దిగుమతులను పెంచడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఉద్యాన పంటలను దృష్టిలో ఉంచుకుని, అలాగే భవిష్యత్తులో పండ్ల ఎగుమతి, దిగుమతులకు తగ్గట్లు.. అత్యాధునిక సౌకర్యాలతో, అంతర్జాతీయ స్థాయిలో దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. హైదరాబాద్ శివార్లలోని కొహెడలో రూ.1,901.17 కోట్లతో 199.12 ఎకరాల్లో అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ నిర్మించడానికి ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. మార్కెటింగ్‌శాఖ డీటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం అనంతరం పనులు మొదలుకానున్నాయి.
1986లో హైదరాబాద్‌లోని కొత్తపేటలో 22 ఎకరాల్లో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేశారు. రద్దీ సమస్య దృష్ట్యా దాన్ని 2021లో కొహెడకు తరలించారు. తాత్కాలిక షెడ్లను నిర్మించగా వర్షాలు, గాలికి కూలిపోయాయి. దీంతో మార్కెట్‌ను బాటసింగారం హెచ్‌ఎండీఏ లాజిస్టిక్ పార్కులోకి మార్చారు. ఇప్పుడు కొహెడలో ఏకంగా 199 ఎకరాల్లో మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం నడుంబిగించింది. ప్రస్తుతం దిల్లీలో 100 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ ఉంది. కొహెడలో మార్కెట్ నిర్మాణం పూర్తి అయితే.. ఢిల్లీని మించి దేశంలోనే అతి పెద్ద ఫ్రూట్ మార్కెట్‌గా హైదరాబాద్ నిలుస్తుంది.
199 ఎకరాల్లో ఎలాంటి సౌకర్యాలంటే..
48.71 ఎకరాల్లో పండ్ల వ్యాపారానికి అవసరమైన మౌలిక వసతులను నిర్మిస్తారు. రోడ్ల కోసం 56.05 ఎకరాలు కేటాయించారు. టోల్‌గేట్, నాలా, గ్రామరోడ్డు వంటివాటికి 17.27 ఎకరాలు, పార్కింగ్ స్థలానికి 16.59 ఎకరాలు కేటాయిస్తారు. పూలు, డ్రైఫ్రూట్స్, పాడి, చేపలు, పౌల్ట్రీ, మాంసం, ఫ్రోజెన్, ప్యాక్డ్ బాటిల్ ఫుడ్స్ వంటి ఉత్పత్తులకు 10.98, కోల్డ్‌స్టోరేజీలకు 9.50 ఎకరాలు కేటాయించనున్నారు. వీటితో పాటు.. పండ్ల రిటైల్ జోన్, సామగ్రి నిల్వ, ప్రాథమిక శుద్ధి, వివిధ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, పరిపాలన భవనం, ప్రయోగశాలలు, విశ్రాంతిగృహాలు, అగ్నిమాపక, పోలీసుస్టేషన్, ఆరోగ్యకేంద్రం, దుకాణాల సముదాయం, ఘనవ్యర్థాల నిర్వహణ, విద్యుత్ సబ్‌స్టేషన్ వంటి నిర్మాణాలు చేపడతారు.
100 అడుగుల టవర్..
వంద అడుగుల ఎత్తులో 19,375 చదరపు అడుగుల స్థలంలో నిర్మించే టవర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులో 4 అంతస్తులను వ్యాపార సంస్థలకు కేటాయిస్తారు. ఆరు హై-స్పీడ్ ప్యాసింజర్ లిఫ్ట్‌లు, హెలిప్యాడ్‌లు ఉంటాయి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య, ఎగుమతి సంస్థలకు లీజుపై స్థలాలను కేటాయించనున్నారు. రూ.350 కోట్లను భూసేకరణకు వెచ్చిస్తున్నారు. రూ.1,694.74 కోట్లతో నిర్మాణ పనులు, ఐటీ సౌకర్యాలు కల్పిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.