Old City: అనుకోకుండా జరిగితే ప్రమాదం.. ఇది కోరి తెచ్చుకుంటున్న పైత్యం..
ఈ మధ్యకాలంలో తరచూ మైనర్ యువతీ యువకులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. రోడ్డుపై బండిని ఇష్టారీతిన నడుపుతూ విన్యాసాలు చేయడం, భయం అనేదే లేకుండా రాత్రుళ్లు రహదారుల్లో చక్కర్లు కొట్టడమే కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే మాట వాస్తవం. పైగా వాళ్లు ప్రమాదాలను కొనితెచ్చుకోవడమే కాక, వాళ్ల సరదాతో రోడ్డున పోయే ఇతరులకు కూడా ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ ధోరణి హైదరాబాద్ నగరంలోనే అధికంగా కనిపిస్తుంది.

నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో ఇటీవల మైనర్స్ ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడిన సంఘటనలు జరిగాయి. ఒక నిర్ణీత వయసు అనేది పూర్తవకముందే చేతిలో బండి, పక్కన ఫ్రెండ్స్‌తో బలాదూర్‌గా తిరగడం, ఆపై ప్రమాదాలు కొని తెచ్చుకోవడం, కొన్ని సంఘటనల్లో ప్రాణాలు కూడా కోల్పోవడం అత్యంత విషాదకరం. అంతా తమకే తెలుసునన్నట్లు తల్లిదండ్రులు ఎంత మొత్తుకుంటున్నా పెడచెవిన పెట్టడం, వాళ్ల కళ్లు గప్పి ఇలాంటి చర్యలకు పూనుకోవడం సాధారణంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మంచి మాట చెప్తే విన్నట్టే విని, ఏమీ చేయడం లేదన్నట్లు నటిస్తూనే రోడ్లపై వాహనాలతో పాటు గుర్రపు సవారీలతో నానాహంగామా చేస్తున్నారు. దీనిపై ముస్లిం మత పెద్దలు సామూహికంగా పిల్లల తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నారు. మైనర్ పిల్లలకు అసలు వాహనం ఇవ్వరాదని, వాళ్ల మీద ఒక కన్ను వేసి ఉంచాలని, వినకపోతే గట్టిగా చెప్పాయినా సరే కట్టడి చేయాలని కోరుతున్నారు.
ఏవైనా పండుగల నేపథ్యంలో పాతబస్తీలోని ఫ్లై ఓవర్స్ మూసివేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఓవైసీ ఆదేశాల మేరకు అధికారులు ప్రధాన రహదారులను మూసివేస్తుండడంతో చిన్న చిన్న బస్తీల్లో రోడ్లపై మైనర్ యువకులు హంగామా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూ ఉండడంతో స్థానిక ఎంఐఎం నేతలు ఆ మైనర్లను పట్టుకుని మందలిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ల తల్లిదండ్రులకి ఫోన్ చేసి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. అయినా మైనర్ యువతలో మార్పు కానరావడం లేదని చెబుతున్నారు. అందుకే తల్లిదండ్రులే దీనికి పూర్తి బాధ్యత వహించాలని అధికారులు చెబుతున్న మాట.
ప్రాణం ఎంతో విలువైనది, ఇలాంటి చిన్న చిన్న సరదాల కోసం జాగ్రత్త అనేదే లేకుండా ప్రవర్తించడం పిల్లలు ఇలా వ్యవహరించడం ఎంతమాత్రమూ సరికాదని అంటున్నారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. మైనర్ల అత్యుత్సాహం వల్ల ఈ మధ్యకాలంలో తరచూ పాతబస్తీలో చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




