Hyderabad: హైదరాబాద్‌లో కొత్త సైబర్ స్కామ్.. తెలుసుకోకపోతే నష్టపోతారు..
సైబర్ క్రైమ్. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. టెక్నాలజీ పెరుగుతున్నట్లుగానే సైబర్ కేటుగాళ్లు సైతం అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. డిజిటల్ పేమెంట్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇదే అదనుగా కేటుగాళ్లు మన బ్యాంక్ ఖాతాలకు కన్నం వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో స్కామ్ వెలుగుచూసింది.

రోజుకో కొత్త రకం క్రైమ్. సైబర్ నేరగాళ్ల ఆలోచనలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఒక అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే.. మరో కొత్త క్రొయేటివ్ థాట్‌తో దూసుకొస్తున్నారు స్కామర్లు. ప్రజల సొమ్మును ఖాతాల నుంచి తెలివిగా దోచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త స్కామ్ జరుగుతోంది. బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని స్కామర్లు నకిలీ సందేశాలు పంపుతున్నారు. వాటిని నిజమే అని నమ్మి పలువురు మోసపోతున్నారు. ఒక వినియోగదారుడు రిసీవ్ చేసుకున్న మెసేజ్ మీ ముందు ఉంచబోతున్నాం.“డియర్ సర్, గత నెల బిల్లు అప్‌డేట్ కాకపోవడంతో ఈరోజు రాత్రి 7:30 గంటల తర్వాత మీ విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. వెంటనే వాట్సాప్ నంబర్‌కు కాల్ చేయండి.” అని ఆ సందేశం సారాంశం.
ఆ మెసేజ్ నిజమే అనుకుని వినియోగదారుడు ఇచ్చిన నంబర్‌కు కాల్ చేసిన తర్వాత… మోసగాళ్ళు పేమెంట్‌ను ప్రాసెస్ చేయడానికి… డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలు ఇవ్వాలని కోరతారు. కొన్నిసార్లు.. బాధితులకు ఫేక్ పేమెంట్ లింక్‌లను పంపుతారు. ఈ మార్గాల్లో విద్యుత్ వినియోగదారుల బ్యాంకింగ్ వివరాలను పొంది.. కేటుగాళ్లు తమ పని మొదలెడతారు. ఆపై నిమిషాల వ్యవధిలోనే మీ ఖాతాల నుంచి నగదు కట్ అవుతాయి. తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) వ్యక్తిగత మొబైల్ నంబర్ల నుండి సందేశాలను పంపదని వినియోగదారులు గమనించాలి. కంపెనీ పంపే అధికారిక సందేశాలలో ఎల్లప్పుడూ విభాగం పేరు, USC/సర్వీస్ నంబర్, వినియోగదారు పేరు, బిల్లు తదితర అంశాలు ఉంటాయి. అందుకే బీ అలెర్ట్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..