AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miss World Controversy: మిస్‌ వరల్డ్‌ పోటీలపై మిస్‌ ఇంగ్లండ్ సంచలన ఆరోపణలు.. విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు

తెలంగాణలోని హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న 72 మిస్‌ వరల్డ్‌ పోటీల నిర్వహణ తీరుపై మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక ఈ వ్యవహారంపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఆమె చేసిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చేందుకు డీజీ శిఖాగోయెల్ నేతృత్వంలో క‌మిటీ ఏర్పాటు చేసింది. ఇక ఈ కమిటీ విచారణలో మిస్‌ ఇంగ్లాండ్‌ ఆరోపణల్లో నిజమెంతన్నదిపై తేలనుంది.

Miss World Controversy: మిస్‌ వరల్డ్‌ పోటీలపై మిస్‌ ఇంగ్లండ్ సంచలన ఆరోపణలు.. విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు
Miss England
Anand T
|

Updated on: May 25, 2025 | 11:09 PM

Share

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ వేదికగా 72వ ప్రతిష్ఠాత్మక మిస్‌ వరల్డ్‌ పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అనూహ్యంగా ఈ పోటీల నుంచి వైదొలిగి ఈ నెల 16న తిరిగి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే తొలుత తన వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపిన మిస్‌ ఇంగ్లాండ్. తమ దేశానికి వెళ్లిన తర్వాత మిస్‌ వరల్డ్‌ పోటీలపై సంచలన ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మిస్‌ వరల్డ్‌ పోటీల నుంచి తప్పుకోవడానికి గల కారణాలు వివరించింది. అయితే పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన పోటీదారులను పోటీల్లో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు మేకప్‌తోనే ఉంచుతున్నారని.. టిఫిన్ చేసే సమయంలో కూడా మేకప్ తీసే అవకాశం ఇవ్వడం లేదని ఆమె ఆ ఇంటర్వ్వూలో తెలిపింది. కొన్ని సందర్భాల్లో నైట్ డ్రెస్సులతో కూడా ఉండాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. కొన్ని ఈవెంట్లలో మేల్ స్పాన్సర్లతో కూర్చోవాల్సి వస్తుందని.. ధనవంతులైన స్పాన్సర్లను అలరించేలా తమపై ఒత్తిడి తెచ్చారని సంచలన ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో దీనిపై తీవ్ర చర్చ నెలకొంది.

ఇక ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ప్రభుత్వం ఆమె ఆరోపణల్లో నిజానిజాలను తేల్చేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మరో ఐపీఎస్ అధికారిణి రమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీలతో కూడా ఉన్నారు. అయితే ఈ త్రిసభ్యకమిటీ ఇప్పటికే తమ దర్యాప్తును ప్రారంభించింది. పోటీల్లో పాల్గొన్న ఇతర యువతులను విచారించి, వారి వాంగ్మూలాలను సేకరించనుంది. అవసరమైతే వీడియో రికార్డింగ్ చేసి మిల్లా మాగీ ఆరోపణల్లో నిజమెంతో తెలుసుకోనుంది. ఆమె ఆరోపించిన విధంగా పోటీల సందర్భంగా నిర్వాహకుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేయనుంది.

మరోవైపు మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియా మోర్లీ మిస్‌ ఇంగ్లండ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆమె చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, అవి నిరాధారమైన ఆరోపణలని ఆమె చెప్పుకొచ్చింది. అయితే త్రిసభ్య కమిటి దర్యాప్తు పూర్తైన తర్వాత ఈ ఆరోపణల్లో నిజానిజాలు వెలుగులోకి రానున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..