Telangana: ముగిసిన ప్రచార పర్వం.. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు.. అలా చేస్తే చర్యలే..
ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. మైకులన్నీ మూగబోవడంతో తెలంగాణ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. అయితే ఈసీ మాత్రం యాక్టివ్ మోడ్‌లోకి వచ్చింది. ప్రచార గడువు ముగియగానే సీన్‌లోకొచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్.. ఎలాంటి ప్రచారానికి తావులేదని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. మైకులన్నీ మూగబోవడంతో తెలంగాణ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. అయితే ఈసీ మాత్రం యాక్టివ్ మోడ్‌లోకి వచ్చింది. ప్రచార గడువు ముగియగానే సీన్‌లోకొచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్.. ఎలాంటి ప్రచారానికి తావులేదని స్పష్టం చేశారు. పార్టీలు ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని హెచ్చరించారు. స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలని ఆదేశించారు. రాబోయే 48 గంటల పాటు ఎలక్షన్ ప్రచారం డిస్‌ప్లే చేయకూడదని.. టీవీల్లో ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ అన్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. ఒకే ప్రాంతంలో ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడితే కఠిన చర్యలు తప్పవు. అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్ మీడియాలో అవకాశం కల్పించనుండగా.. పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం అమలులో ఉంటుంది.
నగదు, మద్యం కట్టడిపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసులకు సూచించారు ఎన్నికల అధికారి వికాస్ రాజ్. 48 గంటల పాటు 24 గంటలు సీసీటీవీ మానిటరింగ్ ఉంటుందన్నారు. ఈవీఎం తరలించే వాహనాలకు జీపీఎస్ ఉంటుంది. పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందుగా మోక్ పోలింగ్ ఉంటుంది. స్లిప్పుల్లో అభ్యర్ధుల పేర్లు ఉండకూడదు. అలాగే పోలింగ్ సిబ్బంది తమ సంబంధిత కేంద్రాల వద్ద ఉదయం 5.30 గంటలకు ఉండాలి. వాహనాల్లో ఓటర్లను తరలిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అని వికాస్ రాజ్ హెచ్చరించారు. ఈవీఎంలను పోలింగ్ ఏజెంట్‌లు ముట్టుకోకూడదు. ఫస్ట్ టైం హోం ఓటింగ్ 27,178 మంది వేయనుండగా.. 15,990 మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు. 1.48లక్షల మంది బ్యాలెట్ ఓట్లు వేయగా.. ఇవాళ కూడా ఈ ఓటింగ్ జరగనుంది. వెబ్ కాస్టింగ్ ద్వారా 27,094 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. EVMల తరలింపు కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ రూపొందించామని.. ఎక్కడా కూడా ఆగకుండా వెళ్లాలన్నారు వికాస్ రాజ్. ఓటర్ తమ దగ్గరున్న 12 గుర్తింపు కార్డులలో ఏదైనా చూపించి ఓటు వేయొచ్చు. అటు పోలింగ్ కేంద్రాల వద్దకు మొబైల్ ఫోన్ అనుమతి లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ మూమెంట్, వెహికిల్‌ను మానిటరింగ్ చేయాలని డీఈఓలకు ఆదేశాలిచ్చారు.
