Hyderabad: హైదరాబాద్‌లో ‘షీ టీమ్స్’ డేగకన్ను.. జాతరలో మహిళలను వేధించిన ఏడుగురిని ఏం చేశారంటే..
ఏ ప్రదేశంలోనైనా సరే ఎవరూ చూడడం లేదని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఆడవాళ్ళకు ఇబ్బందులు కలిగించడం వంటివి చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని..
ఇటీవల గోల్కొండ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళిలో జరిగిన బోనాల సంధర్భంగా దేవలయానికి వచ్చే మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మహిళల ఫోటోలను వారికి తెలియకుండా చిత్రీకరిస్తూ, మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తూ, వారిని తాకుతూ వేదింపులకు పాల్పడిన పోకిరిలను హైదరాబాద్ షీ టీమ్స్ బృందాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసులు నమోదు చేసి న్యాయస్థానం లో ప్రవేశపెట్టారు. కేసుల పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది.
వీరిలో నాగరాజు, షేక్. ఆర్జడ్ అల, పి.కిరణ్ గోల్కొండ బోనాలలో పట్టుబడగా, యం.శ్రీకాంత్, యం.సాయిలు, అబ్దుల్ మముద్ ఖాన్, ఖాజా నసీరుద్దీన్ అనే నలుగురు సికింద్రాబాద్ మహంకాళి బోనాలలో పట్టుబడ్డారని షీ టీమ్ అడిషనల్ సీపీ ఎ.ఆర్. శ్రీనివాస్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ ప్రదేశంలోనైనా సరే ఎవరూ చూడడం లేదని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఆడవాళ్ళకు ఇబ్బందులు కలిగించడం వంటివి చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, ఎక్కడికక్కడ హైదరాబాద్ షీ టీమ్ మఫ్టీలో తిరుగుతూనే వుంటారని ఆయన పేర్కొన్నారు.