AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భాగ్యనగరం చుట్టూ రియల్ బూమ్.. ప్రైవేట్‌ రియల్ ఎస్టెట్‌ సంస్థలకు ఇప్పుడిక కొత్త ఛాలెంజ్..

Hyderabad Real Estate: నగరం చుట్టు రియల్ భూమ్ తిరుగుతోంది. ఏ ప్లాట్ కొందామన్నా ఆకాశన్నంటే రేట్లు.. కొన్నాక విప్పుకోలేని వివాదాలు. ప్రైవేట రియల్ ఎస్టేట్ రంగం పోటీలో ఏం కొనాలా తేల్చుకోలేని స్థితిలో వాటన్నింటికి పోటీగా

Hyderabad: భాగ్యనగరం చుట్టూ రియల్ బూమ్.. ప్రైవేట్‌ రియల్ ఎస్టెట్‌ సంస్థలకు ఇప్పుడిక కొత్త ఛాలెంజ్..
Hmda
Vidyasagar Gunti
| Edited By: Anil kumar poka|

Updated on: Sep 19, 2022 | 1:32 PM

Share

Hyderabad Real Estate: ధరలకు రెక్కలొచ్చిన భూములను కొనడం ఒకఎత్తు అయితే.. చిక్కుల్లేని వాటిని చిక్కించుకోవడం మరో ఎత్తు. ఇలాంటి వాటికి తావే లేదంటూ.. పర్మిషన్లు ఇచ్చే సంస్థే.. ప్లాట్ ఫర్ సేల్ అంటూ బోర్డు పెడితే.. ఇంకేముంది. దొరికిందే ఛాన్స్ అంటూ బయ్యర్లు ఎగబడుతున్నారు. ప్రైవేట్ రియల్ ఎస్టేట్‌కి ఛాలెంజ్ విసురుతున్న హెచ్ఎండీఏ ప్లాట్ల అమ్మకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. నగరం చుట్టు రియల్ భూమ్ తిరుగుతోంది. ఏ ప్లాట్ కొందామన్నా ఆకాశన్నంటే రేట్లు.. కొన్నాక విప్పుకోలేని వివాదాలు. ప్రైవేట రియల్ ఎస్టేట్ రంగం పోటీలో ఏం కొనాలా తేల్చుకోలేని స్థితిలో వాటన్నింటికి పోటీగా ప్రభుత్వం భూముల అమ్మకాలతో దూసుకుపోతోంది. నగరం, శివారు మున్సిపాలిటీల్లో అనుమతులు ఇచ్చే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ నేరుగా స్థలాలను డెవలప్ చేసి ప్లాట్లుగా వేలం వేస్తోంది. దీంతో ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తోంది.

కోకాపేట్, ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలంతో ఊపు మీదున్న హెచ్ఎండీఏ నగర శివారుల్లో మరో రెండు వెంచర్లలో ప్లాట్ల వేలానికి రంగం సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లాలోని తొర్రూరులో 117 ఎకరాలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బహదూర్‌పల్లిలో 40 ఎకరాల్లో రెండు వెంచర్లను డెవలప్ చేసింది. తొర్రూర్‌లో తొలిదశలో 30 ఎకరాల్లో 223 ప్లాట్లను అభివృద్ధి చేసి అమ్మకానికి పెట్టింది. బహదూర్‌పల్లిలో 40 ఎకరాల్లో 101 ప్లాట్లను అమ్మేందుకు సిద్ధమైంది. మార్కెట్ లో రియల్ ఎస్టేట్ కు ఉన్న పాజిటివ్ టాక్‌ను దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండీఏ వ్యవసాయానికి పనికిరాని భూములను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకుంటోంది. వాటిని డెవలప్ చేసి అమ్మకానికి పెడితే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ నెల 14 నుంచి తొర్రూర్, బహదూర్‌పల్లి ప్లాట్ల వేలం జరగబోతుండగా.. ప్రిబిడ్డింగ్ మీటింగ్ ల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

హెచ్ఎండీఏ ప్లాట్ల వైపు మొగ్గు.. 

ప్రభుత్వ సంస్థే భూములు అమ్ముతుందనడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరిగింది. ప్రైవేటు సంస్థల చిక్కుల ఎందుకు అనుకునే వారు హెచ్ఎండీఏ ప్లాట్ల వైపు చూస్తున్నారు. హెచ్ఎండీఏ ప్లాట్లకు ఎందుకు డిమాండ్ ఉందో తెలుసా..! ల్యాండ్ డిస్పూట్స్ అంటే వివాదాలు ఉండవని.. పర్మిషన్లు ఇచ్చే సంస్థే నేరుగా అమ్ముతుండటంతో పర్మిషన్లకు ఢోకా ఉండదని. అంతే కాదు క్లియర్ టైటిల్ ఉంటుందనే భరోసా ఈ ప్లాట్లు కొనేందుకు ఎగబడుతున్నారు. లిటిగేషన్ ల్యాండ్ సేఫ్ అని సై అంటున్నారు. అందులోనూ తక్కువ ధరలో వస్తే సొంతింటికల నిజం చేసుకోవచ్చని సామాన్యులు.. కాస్తో కూస్తో కూడబెట్టుకున్నది ఎలాంటి చిక్కులు లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చని మధ్యతరగతివాళ్లు ఇటువైపు చూస్తున్నారు.

కోకాపేట్, ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలంతో హెచ్ఎండీఏకు మంచి పేరువచ్చింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ ఆ రెండు ప్లాట్ల వేలంను సమర్థంగా నిర్వహించి ప్రభుత్వ ఖజానాకు కోట్లు కురిపించింది. దీంతో గతంలో రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ కింద ప్రభుత్వం తీసుకున్న భూములు అన్యాక్రాంతం కాకుండా చూసేందుకు కేబినెట్ సబ్ కమిటీ వాటిని అమ్మాలని నిర్ణయం తీసుకుంది. ఆ బాధ్యతలు హెచ్ఎండీఏకు అప్పగించాలని అంతా ఓకే చేశారు. దీంతో తొర్రూరు, బహదూర్ పల్లిలో ఓపెన్ ప్లాట్లు, హైదరాబాద్ బడ్లగూడ, ఖమ్మంలో రెడీ టూ ఆక్యుపై గా ఉన్న ఫ్లాట్లను అమ్మే బాధ్యతను హెచ్ఎండీఏ మీదేసుకుంది. ఆన్ లైన్ వేలం వేసే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ MSTC ఆధ్వర్యంలో సోమవారం నుంచి వేలం వేసేందుకు సర్వం సిద్ధం చేసింది.

తొర్రూర్‌లో 117 ఎకరాల్లో

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని తొర్రూర్‌లో 117 ఎకరాల్లో వెయ్యి ప్లాట్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలివిడతగా 30 ఎకరాల్లో 223 ప్లాట్లు అమ్మకానికి పెట్టింది. అదిపెద్ద వెంచర్ లో సబ్ స్టేషన్, సీవరేజ్ ప్లాంట్, 40,60 ఫీట్ రోడ్లు, పార్కులతో ప్రైవేటు సంస్థలకు దీటుగా వెంచర్ ను డెవలప్ చేసింది. ఈ-వేలంలో పాల్గొనే వారు MSTC వైబ్ సైట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ప్లాట్ కి లక్ష చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వేలంలో ప్లాట్ దక్కకపోతే వెంటనే మనీ రిఫండ్ చేస్తారు. తొర్రూర్ లో చదరపు గజం 20 వేల రూపాయలుగా ప్రారంభ ధరను ఫిక్స్ చేశారు. ఇక దుండిగల్ మున్సిపాలిటీ బహదూర్ పల్లిలో 30 ఎకరాల్లో 101 ప్లాట్లను అభివృద్ధి చేయగా దీనికి ఒకవైపు మల్లారెడ్డి యూనివర్సిటీ, మరోవైపు ఫారెస్ట్, ఇంకోవైపు విల్లాలతో పర్యావరణహితమైన ప్లాట్లు తయారుచేసింది. ఇక్కడ ప్రారంభ ధరను చదరపు గజం 25 వేల రూపాయలుగా నిర్ణయించారు. నాగోల్​ బండ్లగూడ వద్ద 26 ఎకరాల విస్తీర్ణంలో 33 టవర్స్ తో మొత్తం 2,700 ఫ్లాట్లను రాజీవ్​ స్వగృహ కార్పొరేషన్​ నిర్మించి.. వాటిలో కేవలం 500 ఫ్లాట్లు విక్రయించారు. మిగిలిన వాటిని హెచ్ఎండీఏ వేలం పాటతో అమ్మబోతుంది. ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ స్వగృహలోని 8 టవర్స్ లోని ఫ్లాట్లను ఈ నెల 14 నుంచి హెచ్ఎండీఏ ఈ ఆక్షన్ తో అమ్ముతుంది.

పెరుగుతున్న డిమాండ్..

హెచ్ఎండీఏ చేపడుతున్న భూముల అమ్మకాలతో రిజిస్ట్రేషన్ల పేరిట ప్రభుత్వానికి 7.5 శాతం సొమ్ము సమకూరుతుంది. వ్యవసాయేతర భుముల సేకరణ ల్యాండ్ పూలింగ్ కావడంతో ఇక్కడ వ్యాపారం కాదని.. అభివృద్ధి చేసి రైతులకు, ప్రభుత్వానికి హెచ్ఎండీఏ సంస్థ లబ్దిచేకూరుస్తోందని అధికారులు చెబుతున్నారు. విస్తరిస్తున్న మహానగరం హైదరాబాద్ శివారుల్లో రోజుకు పుట్టుగొడుగుల్లా లే అవుట్లు వెలుస్తున్నాయి. హచ్ఎండీఏ ప్లాట్ల అమ్మకంతో వాటి చుట్టుపక్కల ప్లాట్లకు ధరలు అమాంతం పెరుగుతోంది. ఈ ఒరవడి ఇలానే సాగితే అవుటర్ రింగ్ రోడ్డు అవతల త్వరలో రాబోయే రీజినల్ రింగ్ రోడ్డు వరకు లేఅవుట్లు వేగంగా పాకనున్నాయి.

-విద్యాసాగర్, టీవీ9 తెలుగు రిపోర్టర్, హైదరాబాద్

Also Read:

BJP Telangana: మంత్రుల నియోజకవర్గాలపై బీజేపీ స్పెషల్‌ ఫోకస్‌.. తెలంగాణలో కమలం పార్టీ ఆపరేషన్ షురూ..!

Tamilisai Soundararajan: సీఎం కేసీఆర్ సంపూర్ణారోగ్యంతో ఉండాలి.. పుష్పగుచ్ఛం, లేఖ పంపిన గవర్నర్‌ తమిళిసై