AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆ ఒక్క మాయదారి రోగం ఈ పోలీస్ జీవితాన్ని తలకిందులు చేసింది..

ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం ఒక పోలీసు అధికారి జీవితాన్నే కుదిపేసింది. అంబర్‌పేట క్రైమ్ ఎస్ఐగా పనిచేసిన భాను ప్రకాశ్ రెడ్డి… రికవరీ నగదు, బంగారం కాజేయడమే కాకుండా తన సర్వీస్ రివాల్వర్‌ను కూడా తాకట్టు పెట్టినట్లు వచ్చిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. గ్రూప్–2లో ఎంపికై కొత్త జీవితం మొదలుపెట్టాల్సిన వేళ… అరెస్ట్‌తో అన్నీ తలకిందులయ్యాయి. ఈ కేసులో ఇంకా ఎన్ని మలుపులు దాగి ఉన్నాయి?

Hyderabad: ఆ ఒక్క మాయదారి రోగం ఈ పోలీస్ జీవితాన్ని తలకిందులు చేసింది..
Bhanu Prakash Reddy
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jan 10, 2026 | 4:55 PM

Share

ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం ఓ పోలీసు అధికారి జీవితాన్నే అస్తవ్యస్తం చేసింది. అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ ఎస్ఐగా పనిచేసిన భాను ప్రకాశ్ రెడ్డి ఉదంతం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. బెట్టింగ్ అప్పులు తీర్చుకునే క్రమంలో రికవరీకి సంబంధించిన నగదు, బంగారాన్ని కాజేయడమే కాకుండా.. తన సర్వీస్ రివాల్వర్‌ను కూడా తాకట్టు పెట్టినట్లు వచ్చిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ కేసులో తాజాగా కీలక మలుపు తిరిగింది. భాను ప్రకాశ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ప్రాథమిక విచారణలోనే భాను ప్రకాశ్ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైనట్టు తేలింది. జూదం కోసం భారీగా అప్పులు చేసిన అతడు.. వాటిని తీర్చేందుకు చట్టవిరుద్ధ మార్గాన్ని ఆశ్రయించినట్లు దర్యాప్తులో బయటపడింది. వివిధ కేసుల్లో పోలీసులు రికవరీ చేసిన నగదు, బంగారం బాధితులకు లేదా కోర్టుకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ భాను ప్రకాశ్ ఆ నిబంధనలను పూర్తిగా విస్మరించాడు. రికవరీ చేసిన ఆస్తులను తన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసు శాఖలోనే తీవ్ర చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా అతడి సర్వీస్ రివాల్వర్ వ్యవహారం మరింత కలకలం రేపింది. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో తన రివాల్వర్ పోయిందని, ఎంత వెతికినా దొరకలేదని భాను ప్రకాశ్ చెప్పాడు. అయితే నిజంగా ఆయుధం పోయిందా..? లేక అప్పుల కోసం దాన్ని తాకట్టు పెట్టారా..? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో మరో ఆసక్తికర విషయం కూడా వెలుగులోకి వచ్చింది. భాను ప్రకాశ్ రెడ్డి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన గ్రూప్–2 పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించి.. ఏపీ గ్రూప్–2 సర్వీసులకు ఎంపికయ్యాడు. దీంతో తెలంగాణ పోలీసు శాఖ నుంచి రిలీవ్ కావాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు కూడా చేసుకున్నాడు. మరికొద్ది రోజుల్లో మెరుగైన హోదాలో కొత్త ఉద్యోగంలో చేరాల్సిన వ్యక్తి.. బెట్టింగ్ వ్యసనం కారణంగా తన భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు అరెస్ట్ కావడంతో గ్రూప్–2 ఉద్యోగం దక్కే అవకాశం దాదాపుగా కోల్పోయినట్టే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2020 బ్యాచ్‌కు చెందిన భాను ప్రకాశ్ రెడ్డి అంబర్‌పేట పీఎస్‌లో క్రైమ్ ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలోనే ఈ అవినీతి వ్యవహారాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇటీవల నాలుగు తులాల బంగారం చోరీ కేసు దర్యాప్తులో భాగంగా బంగారాన్ని రికవరీ చేసిన భాను ప్రకాశ్.. దాన్ని బాధితులకు అప్పగించలేదు. త్వరలో బంగారం ఇస్తానని చెప్పి లోక్ అదాలత్‌లో కేసును క్లోజ్ చేయించాడు. కానీ కేసు ముగిసిన తర్వాత కూడా బంగారం ఇవ్వకుండా దాన్ని తాకట్టు పెట్టినట్లు బయటపడింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో దర్యాప్తు ప్రారంభమై.. చివరకు అరెస్ట్ వరకు వెళ్లింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..