AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu: అబద్దాల మోహన్‌ బాబు.. మీడియానే కాదు పోలీసులపై కూడా విమర్శలు.. ఆ రోజు అసలేం జరిగిందంటే..

మీడియాపై తాను చేసిన దాడి గురించి నటుడు మోహన్‌బాబు వివరణ ఇస్తూ ఓ ఆడియో విడుదల చేశారు. దానిలో తను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అబద్ధాల కవరింగ్‌తో, తన నటనా చాతుర్యపు కలరింగ్‌తో.... వాస్తవాలకు మసి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు మోహన్‌బాబు... అసలు ఆరోజు ఏం జరిగిందో మొత్తం గమనించగలరు..

Shaik Madar Saheb
|

Updated on: Dec 13, 2024 | 10:33 AM

Share

మీడియాపై తాను చేసిన దాడి గురించి నటుడు మోహన్‌బాబు వివరణ ఇస్తూ ఓ ఆడియో విడుదల చేశారు. దానిలో తను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అబద్ధాల కవరింగ్‌తో, తన నటనా చాతుర్యపు కలరింగ్‌తో…. వాస్తవాలకు మసి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు మోహన్‌బాబు. ఆయన చెప్పిందేంటి? అసలు అక్కడ జరిగిందేంటి? మోహన్‌బాబు అలవోకగా చెప్పిన అబద్ధాలు, అక్కడ యథార్థంగా జరిగిందేంటో చూద్దాం..

హైదరాబాద్‌ శివార్లలోని జల్‌పల్లి వేదికగా…నటుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో కొద్ది రోజులుగా రచ్చ జరుగుతోంది. మోహన్‌బాబు, ఆయన పెద్దకొడుకు విష్ణు ఓవైపు, చిన్న కుమారుడు మంచు మనోజ్‌ మరోవైపు మోహరించి గొడవలకు దిగారు. వాళ్లలో వాళ్లు కొట్టుకున్నారు. పబ్లిక్‌గా నానా న్యూసెన్స్‌ చేశారు. ఇరు వర్గాలు… బౌన్సర్లు, రౌడీలను రంగంలోకి దింపి యుద్ధానికి దిగాయి. అది కాస్తా లా అండ్‌ ఆర్డర్ ఇష్యూగా మారిపోయింది. దీంతో పోలీసులు ఎంటర్‌ అయ్యారు. పోలీసుల వెనుక ప్రెస్‌ వెళ్లింది. అంతే కానీ, మోహన్‌బాబు చెప్పినట్లు, ఆయన ఇంటి గేట్లు బద్దలు కొట్టుకుని మీడియా వెళ్లలేదు. మీడియా వెళ్లేసరికే అక్కడ పోలీసులు మోహరించి ఉన్నారు. ఈ నేపథ్యంలో తన డ్యూటీలో భాగంగా…సంఘటనను కవర్‌ చేస్తున్న టీవీ9 ప్రతినిధి రంజిత్‌పై ఉద్దేశపూర్వకంగా మోహన్‌బాబు దాడి చేశారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా మోహన్‌బాబుకు వ్యతిరేకంగా మీడియా, ప్రజా సంఘాలు, మేధావులు, కళాకారులు, నేతలు గొంతు విప్పుతున్న సందర్భంలో, ఆయన ఓ ఆడియో విడుదల చేశారు.

రాత్రి పూట మీడియా తన ఇంటి గేట్లు బద్దలు కొట్టుకుని లోపలకు వచ్చిందని, ఆ ఆడియోలో ఆరోపించారు మోహన్‌బాబు.

అబద్ధం 1:

ఇది మోహన్‌బాబు చెప్పిన అబద్ధం 1. గేట్లు పగులగొట్టి లోపలకు వెళ్లింది మీడియా కాదు. మోహన్‌బాబు పుత్రరత్నం మంచు మనోజ్‌ కుమార్. ఆయన తన మనుషులతో కలిసి జై శ్రీరామ్‌ అంటూ మోహన్‌బాబు ఇంటి గేట్లను బద్దలు కొట్టుకుని లోపలకు దూసుకెళ్లారు.

మీడియా వాళ్లను కొట్టాలని, తిట్టాలని తాను దైవసాక్షిగా అనుకోలేదంటూ ఆ ఆడియోలో చెప్పారు మోహన్‌బాబు.

అబద్ధం 2:

ఇది మోహన్‌బాబు చెప్పిన రెండో అబద్ధం. గుడ్లు ఉరుముతూ మీడియా అని తెలిసే, టీవీ9 రిపోర్టర్‌ రంజిత్‌పై మోహన్‌బాబు ఎలా దాడి చేశారో అందరికీ తెలిసిందే..

మీడియా మైకు వల్ల కొద్దిలో ఉంటే తన కన్ను పోయేదని, తనకు దెబ్బ తగిలిందని మరో అబద్ధపు ఆరోపణ అలవోకగా గుప్పించారు మోహన్‌బాబు.

అబద్ధం 3:

ఇది మోహన్‌బాబు చెప్పిన మూడో అబద్ధం. మైకు ఎక్కడుంది, మోహన్‌బాబు కన్ను ఎక్కడ ఉందో మీరే చూడండి. మైక్‌ వల్ల ఆయన కంటికి దెబ్బ తగిలిందని, కొద్దిలో ఎస్కేప్‌ అయ్యానని అబద్ధం చెబుతున్నారు.

అక్కడ ఘర్షణ జరగడం వల్లే తాను దాడి చేయాల్సి వచ్చిందన్నారు మోహన్‌బాబు.

అబద్ధం 4:

టీవీ9 రిపోర్టర్‌ రంజిత్‌కి మోహన్‌ బాబుకు మధ్య ఘర్షణ జరగలేదు. ఆయనకు ఆయన చిన్న కొడుక్కి మధ్య ఘర్షణ జరిగింది. వాళ్లు వాళ్లు కొట్టుకున్నారు. న్యూసెన్స్ జరిగింది. శాంతిభద్రతలు అదుపు తప్పడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే మిగతా మీడియాతో కలిసి టీవీ9 ప్రతినిధి వెళ్లారు. అయితే పోలీసుల సమక్షంలో టీవీ9 జర్నలిస్టుపై మోహన్‌బాబు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు. ఇది ఆయన చెప్పిన నాల్గో అబద్ధం. అక్కడ ఏం జరిగిందో పూర్తి వీడియోలో గమనించవచ్చు..

తన ఏకాగ్రతను మీడియా భగ్నం చేసిందని ఆ ఆడియోలో ఆరోపించారు మోహన్‌బాబు.

అబద్ధం 5:

ఇది మోహన్‌బాబు చెప్పిన ఐదో అబద్ధం. మోహన్‌బాబు ఏకాగ్రతను మీడియా భగ్నం చేసిందిట. మనోజ్‌ బాధని రిపోర్ట్‌ చేస్తున్న సందర్భంలో మోహన్‌బాబు ఎదురుగా రావడంతో ఆయన అభిప్రాయం తెలుసుకోవడానికి మాత్రమే, ఆయన ముందు మైక్‌ పెట్టి మీ కొడుకు ఇలా ఆరోపణలు చేస్తున్నారు. మీరేమంటారు అని మాత్రమే మా రిపోర్టర్‌ రంజిత్‌ అడిగారు. అక్కడ జరిగింది ఇది.

తాను కొట్టడం తప్పేనంటూ, మీడియా తన ఇంట్లో దూరినందునే కొట్టాల్సి వచ్చిందన్నట్లు మాట్లాడారు మోహన్‌బాబు.

అబద్ధం 6:

ఇది మోహన్‌బాబు చెప్పిన ఆరో అబద్ధం. ఆయన ఇంట్లో దూరినందుకు మీడియాపై దాడి చేశారట. మంచు మనోజ్‌ వచ్చి మీడియా ప్రతినిధులను తీసుకుని వెళితేనే, మిగిలిన మీడియా ప్రతినిధులతో కలిసి టీవీ9 కూడా వెళ్లింది. మోహన్‌బాబు ఇంట్లోకి, వ్యక్తిగత జీవితంలోకి దూరే ఉద్దేశం టీవీ9కి లేదు. ఆయన ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపకు వెళ్లింది మనోజ్‌. అది కూడా విజువల్స్‌లో చూడొచ్చు.

దాడి చేసింది మీడియా పైన అని తనకు తెలియదని ఆడియోలో చెప్పుకొచ్చారు మోహన్‌బాబు. తాను దాడి చేసింది జర్నలిస్టు పైన అని, అతడు టీవీ9 రిపోర్టర్‌ అని తనకు తెలియదంటూ జంకుగొంకు లేకుండా బొంకేశారు మోహన్‌బాబు.

అబద్ధం 7:

చింతిస్తున్నా అని చెబుతూనే అలవోకగా ఏడో అబద్ధం చెప్పేశారు మోహన్‌బాబు. అక్కడ ఉన్నది మీడియా అని ఆయనకు తెలియదుట. అసలు టీవీ9 అని నాకు ఎలా తెలుస్తుంది అని ఆయన ప్రశ్నించారు. అయితే మీడియా పేరు చెబుతూనే మోహన్‌బాబు ఎలా దాడి చేశారో మనం చూడొచ్చు. బూతుపదం ఉపయోగిస్తూ తర్వాత జర్నలిజం అన్నారు. అది కూడా మనం స్పష్టంగా వినొచ్చు. అంటే జర్నలిస్ట్‌, టీవీ9 రిపోర్టర్‌ అని తెలిసే మోహన్‌బాబు దాడి చేశారు అనేది స్పష్టంగా తెలుస్తోంది.

మీడియా పైన భౌతికదాడులు చేసిన మోహన్‌బాబు, ఇప్పుడు పోలీసులపై కూడా విమర్శలు గుప్పించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు.

అబద్ధం 8:

పోలీసులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారుట. ఆయన మీద కేసులు పెడుతున్నారట. తన ఇంట్లోకి గేట్లు బద్దలు కొట్టుకుని వచ్చారంటూ అదే అబద్ధాన్ని పదేపదే వల్లె వేస్తున్నారు మోహన్‌బాబు. నా ఇంట్లోకి గేట్లు బద్దలు కొట్టుకుని రావడం న్యాయమా చెప్పండి చెప్పండి చెప్పండి అంటూ ముమ్మారు వల్లించి సినిమాటిక్‌గా డైలాగ్‌ చెప్పారు మోహన్‌బాబు. ఆయన ఇంట్లోకి గేట్లు పగులగొట్టుకుని వెళ్లింది మీడియానా, ఆయన పుత్రరత్నం మంచు మనోజ్‌ కుమారా? ఆయన చెప్పిందేంటి అక్కడ జరిగిందేంటి?

అబద్ధాల కవరింగ్‌తో వాస్తవాలకు మసి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు మోహన్‌బాబు. దాడి చేసి జర్నలిస్టులను తీవ్రంగా గాయపరచడమే కాకుండా…అది తప్పే కాదన్నట్లు తనను తాను సమర్థించుకోవడం, జంకుగొంకు లేకుండా అలవోకగా అబద్ధాలు చెప్పేసి, మరోసారి బొక్కబోర్లా పడ్డారు మోహన్‌బాబు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..