Hyderabad: హైదరాబాద్‌ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. గతంలోనే ఇలాంటి ఘటనే.. కావాలనే అంటున్న స్థానికులు..

సరిగ్గా సంవత్సరం తిరక్కుండానే అదే ప్రాంతంలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. నిజంగా అగ్నిప్రమాదం యాదృచ్ఛికంగా జరిగిందా లేదా కుట్రకోణంలో భాగంగానే జరిగిందా.. ఆ దిశగా దర్యాప్తు చేయాలని పోలీసులను బాధితులు కోరుతున్నారు.

Hyderabad: హైదరాబాద్‌ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. గతంలోనే ఇలాంటి ఘటనే.. కావాలనే అంటున్న స్థానికులు..
Fire Accident
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 20, 2023 | 10:10 AM

హైదరాబాద్, సెప్టెంబర్20: అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.. ఈ అగ్ని ప్రమాదంలో పుత్లి బౌలి ప్రధాన రహదారి పక్కనే ఉన్న గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి… భారీగా ఎగిసి పడ్డ మంటల దాటికి గుడిసెలన్నీ క్షణాల్లో కాలి బూడిదయ్యాయి.. ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించి, మంటలు చెలరేగిన వెంటనే గుడిసెల్లో ఉన్నవారంతా అప్రమత్తమయ్యారు.. వెంటనే గుడిసెల్లోంచి బయటకు పరుగులు పెట్టారు. దీంతో స్థానికులంతా ప్రాణాలతో బయటపడ్డారు.. సరిగ్గా గత ఏడాది ఇదే ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. తిరిగి అదే ప్రాంతంలో మళ్లీ అదే మంటలు వ్యాపించాయి. వరుస అగ్నిప్రమాదాలతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

పుత్లి బౌలి ప్రధాన రహదారి పక్కనే ఖాళీ స్థలంలో చాలాకాలంగా కొంతమంది గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు… వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చిన వీరిలో కొందరు చెత్త ఏరుకుంటూ కొందరు, బుట్టలను అల్లుకుంటూ మరికొందరు అక్కడే ఏళ్లుగా నివాసం ఉంటున్నారు.. సరిగ్గా అర్ధరాత్రి దాటకా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మొదటగా ఒక గుడిసెలో మొదలైన మంటలు క్షణాల్లో మిగతా గుడిసెలు అన్నిటినీ చుట్టుముట్టాయి. అనంతరం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, అఫ్జల్గంజ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.. మూడు ఫైరింజల సహాయంతో మంటలనార్పే ప్రయత్నం చేశారు. సుమారు గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.. గుడిసెలకు పక్కనే కార్గో సర్వీసెస్ ఉంది.. దీంతో పదుల సంఖ్యలో బస్సులను అక్కడే పార్క్ చేస్తారు.. మంటలు కార్గో సర్వీసెస్ దాకా వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అదుపు చేశారు.. ఈ ప్రమాదంలో గుడిసెలతోపాటు బాధితులు దాచుకున్న డబ్బు, బట్టలు ఇతరాత్ర వస్తువులు కాలి బూడిదవ్వడంతో బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు.

అగ్ని ప్రమాదానికి కారణం హై టెన్షన్ వైర్లు అయ్యి ఉండొచ్చు అని ఫైర్ సిబ్బంది చెబుతున్నారు.. అగ్నికి ఆహుతైన గుడిసెల మీదుగా హైటెన్షన్ వైర్లు వెళుతుంటాయి.. ఆ హై టెన్షన్ వైర్ల మధ్య రాపిడి కారణంగా ఏర్పడిన నిప్పురవ్వలు గుడిసెల మీద పడడంతో మంటలు అంటుకుని ఉండొచ్చని ఫైర్ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది.. అప్పుడు కూడా సుమారు 20 కి పైగా గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి.. గత సంవత్సరం అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఆ ప్రమాదంలో కుట్ర కోణం ఉంది అని బాధితులు ఆరోపించారు..

ఇవి కూడా చదవండి

వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చిన వీరంతా చాలా కాలంగా పుత్లి బౌలి రహదారిని ఆనుకుని మూసి ఒడ్డున నివాసం ఉంటున్నారు.. తమను ఖాళీ చేయించే ప్రయత్నంలో భాగంగా తమ గుడిసెలు తగలబెట్టారని గతంలో వీరంతా ఆరోపించారు.. సరిగ్గా సంవత్సరం తిరక్కుండానే అదే ప్రాంతంలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. నిజంగా అగ్నిప్రమాదం యాదృచ్ఛికంగా జరిగిందా లేదా కుట్రకోణంలో భాగంగానే జరిగిందా.. ఆ దిశగా దర్యాప్తు చేయాలని పోలీసులను బాధితులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..