కాంగ్రెస్ టూ బీజేపీ.. మళ్లీ యూ-టర్న్.. పోయిన చోటే వెతుక్కుంటున్న కోమటిరెడ్డి రాజకీయ ప్రస్థానం ఇది
Komatireddy Rajagopal Reddy Telangana Election 2023: కోమటిరెడ్డి బ్రదర్స్.. తెలంగాణ రాజకీయాల్లో వీరికంటూ ప్రత్యేకమైన క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కాంగ్రెస్‌లో సీనియర్ నేత అయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన రాజకీయ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు.

Komatireddy Rajagopal Reddy Telangana Election 2023: కోమటిరెడ్డి బ్రదర్స్.. నల్గొండ రాజకీయాల్లో వీరికంటూ ప్రత్యేకమైన క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కాంగ్రెస్‌లో సీనియర్ నేత అయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన రాజకీయ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. 2009లో భువనగిరి లోకసభ నియోజకవర్గం నుంచి పోటి చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 1,39,978 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2016 నుంచి 2018 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటి చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి(ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 22,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఇదిలా ఉండగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 ఆగష్టు 2న కాంగ్రెస్‌కు, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. 2022, ఆగష్టు 21న మునుగోడులో జరిగిన ఆత్మగౌరవ సభలో కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆ పార్టీ నుంచి 2022లో మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయగా.. సమీప బీఆర్ఎస్ అభ్యర్ధి చేతుల్లో ఓడిపోయారు. మునుగోడు బైపోల్ ఎన్నికల్లో తన ఆస్తుల విలువ రూ. 222.67 కోట్లుగా అఫిడివేట్‌లో ప్రకటించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనకు రూ.61.5 కోట్లు అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఇక ఆస్తుల వివరాలలో.. స్థిరాస్తుల విలువ రూ.152.69 కోట్లు కాగా, చరాస్తుల విలువ రూ.69.97 కోట్లుగా పేర్కొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
అనంతరం ఆయన్ని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా 2023 జూలై 5న బీజేపీ జాతీయ నాయకత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీలో ఉన్నా సరే.. మునుగోడు కేడర్.. రాజగోపాల్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. అప్పటి నుంచి బీజేపీతో ఉన్నప్పటికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం అసంతృప్తితోనే కొనసాగుతూ వచ్చారు. పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో ఎక్కడా కూడా కనిపించలేదు. ఇక తాజాగా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. నియోజకవర్గంలోని తన అనుచరుల అభిప్రాయం మేరకు మనసు మార్చుకుంటున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌లో కొనసాగాలన్న వారి అభిప్రాయం మేరకు బీజేపీకి రాజీనామా చేసి.. హస్తం పార్టీకి మరోసారి షేక్ హ్యాండ్ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం పార్టీలోకి వచ్చిన ఆయన.. ఎమ్మెల్యేగా మునుగోడు బరిలోకి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.
మునుగోడులో ఏం జరగనుంది..
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి మారారు. 2018లో కాంగ్రెస్ తరపున మునుగోడు నుంచి గెలుపొందిన రాజగోపాల్ రెడ్డి.. ఈసారి కూడా గెలుస్తారని పలు సర్వేలు చెబుతున్నాయి. తిరిగి కాంగ్రెస్‌లోకి చేరడం ఆయనకు కలిసొచ్చే అంశంగా తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..