పంచముఖాలతో.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఖైరతాబాద్ మహా గణపతి.. తొలి పూజ ఎప్పుడంటే..
హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి మొదలైంది. ఖైరతాబాద్‌లో 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.. సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళికామాత విగ్రహాలతో మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మరోవైపు బాలాపూర్ గణపతి పూరీ జగన్నాథ ఆలయ థీమ్‌తో భక్తులను ఆకట్టుకోనున్నారు. తొలి పూజ తర్వాత భక్తులకు దర్శనాలు ప్రారంభం కానున్నాయి.

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి మొదలవుతోంది. సిటీలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే ఖైరతాబాద్ మహా గణపతి పూజలందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సారి ఖైరతాబాద్ మహాగణపతి విభిన్న రూపంలో భక్తులను ఆకట్టుకోనున్నాడు. పంచముఖ సంకటహర మహాగణపతిగా దర్శనమివ్వబోతున్నాడు. 69 అడుగుల ఎత్తుతో ఐదు పడగలు, పంచముఖాలతో గణపతి రూపాన్ని తీర్చిదిద్దారు. మహాగణపతికి ఒకవైపు సోమనాథ్ జ్యోతిర్లింగం.. మరోవైపు కాళికామాత విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీంతో.. ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంగణం ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
భక్తుల కోలాహలం మధ్య విగ్రహ శిల్పి రాజేంద్రన్ మహాగణపతి విగ్రహానికి తుది మెరుగులు దిద్దారు. గణపతి విగ్రహానికి కంటి పాపను అమర్చి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. దీంతో.. ఖైరతాబాద్ పరిసరాల్లో సందడి నెలకొంది. రేపు వినాయక చవితి సందర్భంగా.. సోమవారం ఉదయం 10గంటలకు గవర్నర్ తొలి పూజలో పాల్గొంటారు. ఆ తర్వాత మహాగణపతి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోనున్నారు. దీంతో.. రేపటి నుంచి ఈ నెల 25 వరకు ఖైరతాబాద్ గణపయ్య పూజలు అందుకోనున్నాడు. బడా గణేష్‌ను దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలిరానున్నారు. ఈ మేరకు ఖైరతాబాద్ మహా గణపతి చుట్టుపక్కలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పూరీ జగన్నాథుడి ఆలయ సెట్టింగ్‌తో బాలాపూర్ గణేషుడు..
బాలాపూర్ గణేషుడు ఈసారి పూరీ జగన్నాథుడి ఆలయ సెట్టింగ్‌తో దర్శనమివ్వబోతున్నాడు. భక్తులకు ఈ ఏడాది సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఒడిశా పూరీ జగన్నాథుడు ఆలయ నమూనాను ఎంచుకుంది. సీనియర్ డెకరేటర్ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు చివరి దశకు చేరుకున్నాయి. కలింగ శైలి వాస్తు కళా నైపుణ్యానికి, ఆధ్యాత్మిక పవిత్రతకు చిహ్నమైన పూరీ జగన్నాథుడు ఆలయం మాదిరిగా బాలాపూర్ గణపతి సెట్టింగ్ కనువిందు చేయబోతోంది.
ఒడిశాలోని ఒరిజినల్ జగన్నాథ ఆలయ శిల్పకళను తలపించేలా ప్రతి పిల్లర్, ప్రతి కళాఖండం పర్‌ఫెక్ట్‌గా వచ్చేలా డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే.. గణేష్ మంటపం సెట్టింగ్ ఆకట్టుకుంటుండగా.. రేపటికి మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ప్రతి ఏటా విభిన్న థీమ్స్‌తో ఆకట్టుకునే బాలాపూర్ గణేష్ మండపం, ఈసారి పూరీ జగన్నాథ థీమ్‌తో మరింత హైలైట్ కానుంది. ఈ వెరైటీ సెట్టింగ్స్‌తో పాటు.. బాలాపూర్ లడ్డూ వేలానికి కూడా మంచి క్రేజ్ ఉంటుంది. గతేడాది బాలాపూర్ లడ్డూ వేలం 35 లక్షలు పలికింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
