ధనవంతులు కావడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! సిఏలు సూచిస్తున్న 5 ముఖ్యమైన ఆర్థిక అలవాట్లు
సంపన్నులు కేవలం ఎక్కువ సంపాదించడం వల్లే కాకుండా, వారు పాటించే ప్రత్యేకమైన ఆర్థిక అలవాట్ల వల్లే ధనవంతులుగా నిలబడతారని చార్టర్డ్ అకౌంటెంట్లు వివరిస్తున్నారు. వారు ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయడం మాత్రమే కాకుండా, పెట్టుబడులను చక్రవడ్డీ రూపంలో పెరిగేలా ప్లాన్ చేస్తారు. అనవసరపు ఖర్చులను అదుపులో ఉంచుకుంటూ, ఆస్తులు, అప్పుల మధ్య తేడాను స్పష్టంగా గుర్తిస్తారు. అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవడం, నిరంతరం ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛను సాధించవచ్చని వివరిస్తున్నారు.

చాలామంది ఎక్కువ జీతం లేదా ఆదాయం వస్తేనే ధనవంతులు కాగలమని భావిస్తుంటారు. కానీ, నిజానికి సంపన్నులు కావడం అనేది మీరు ఎంత సంపాదిస్తున్నారనే దానికంటే, వచ్చిన డబ్బును ఎలా నిర్వహించారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ అఖిల్ కంచర్ల అభిప్రాయం ప్రకారం, సంపన్నులు పాటించే కొన్ని ముఖ్యమైన ఆర్థిక అలవాట్లు వారిని సాధారణ వ్యక్తుల కంటే ఎంతో ముందు వరుసలో నిలబెడతాయి.
ఆస్తులు vs అప్పులు తేడా గుర్తించడం:
ధనవంతులు ఎల్లప్పుడూ తమ జేబులోకి డబ్బును తెచ్చిపెట్టే ఆస్తులు ఉదాహరణకు స్టాక్స్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ పై దృష్టి పెడతారు. కానీ, సాధారణ ప్రజలు కార్లు, ఖరీదైన గ్యాడ్జెట్లు వంటి సమయంతో పాటు విలువ తగ్గే వస్తువులపై ఎక్కువ ఖర్చు చేస్తారు.
చక్రవడ్డీ టెక్నిక్ ఉపయోగించడం:
శ్రీమంతులు చిన్న వయస్సులోనే పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తారు. చక్రవడ్డీ ద్వారా సుదీర్ఘకాలంలో స్వల్ప మొత్తాలు కూడా భారీ సంపదగా మారతాయని వారు నమ్ముతారు. లాభాలను మళ్లీ రీ-ఇన్వెస్ట్ చేయడం వీరి ప్రధాన అలవాటు.
పొదుపు ముందే… ఖర్చులు తర్వాత:
సాధారణంగా చాలామంది ఆదాయం వచ్చిన తర్వాత ఖర్చులు చేసి మిగిలినదాన్ని పొదుపు చేస్తారు. కానీ, ధనవంతులు ఆదాయం రాగానే ముందుగా తమ లక్ష్యాలకు సరిపడా పెట్టుబడులను పక్కనబెట్టి, ఆ తర్వాత మిగిలిన దాంతోనే నెలవారీ ఖర్చులను ప్లాన్ చేస్తారు.
అత్యవసర నిధి, రిస్క్ మేనేజ్‌మెంట్:
ఆర్థిక సంక్షోభాలు లేదా ఉద్యోగ భద్రత లేని సమయంలో ఇబ్బంది పడకుండా ఉండటానికి కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఆరోగ్య, జీవిత భీమా తీసుకోవడం ద్వారా తమ సంపదను కాపాడుకుంటారు.
ఆర్థిక పరిజ్ఞానం :
డబ్బును నిర్వహించడంలో నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా అవసరం. పన్ను ఆదా మార్గాలు, ద్రవ్యోల్బణాన్ని అధిగమించే మార్గాలపై సంపన్నులు నిరంతరం దృష్టి సారిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ, సరైన ప్లానింగ్, ఓర్పు ఉంటే ఎవరైనా సులభంగా ఆర్థిక స్వేచ్ఛను సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.




