Rain Alert : ఆ రెండ్రోజులు అస్సలు బయటకు రాకండి.. తెలంగాణపై వరుణుడి విశ్వరూపం!

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాబోయే రెండుమూడు రోజుల్లో ఈ వర్షాలు మరింత తీవ్ర రూపం దాల్చుతాయని తాజాగా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ సముద్ర తీరానికి సమీపంలో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 13 నాటికి అల్పపీడనం ఏర్పడనుందని.. దాని ప్రభావంతోనే రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Rain Alert : ఆ రెండ్రోజులు అస్సలు బయటకు రాకండి.. తెలంగాణపై వరుణుడి విశ్వరూపం!
Telangana Rains

Updated on: Aug 10, 2025 | 9:54 PM

ఏపీలోని సముద్ర తీరానికి సమీపంలో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 13 నాటికి అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ ప్రకటించింది. ఈ అల్పపీడన ప్రభావంతో  హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే విషయంపై తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ స్పందిస్తూ ఎక్స్‌ వేదికగా ఒక పోస్ట్‌ చేశారు. రానున్న రెండు మూడు రోజుల్లో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం రాసుకొచ్చారు.

ముఖ్యంగా వర్షం పడితే హైదరాబాద్‌ నగరంలో భారీగా ట్రాఫిక్‌ ఏర్పడుతుంది కాబట్టి, ఆగస్టు 13, 14 తేదీల్లో హైదరాబాద్‌ నగరంలోని పలు కంపెనీల ఉద్యోగులు పనివేళ్లతో మార్పులు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆదే విధంగా ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఉండే ఏరియాలను గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని తెలిపారు.

ఇక వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. ఆగస్టు 13వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఆగస్టు 14న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఐఏండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.