Srusti Fertility Centre: సృష్టి అక్రమాల కేసులో ఈడీ ఎంట్రీ
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులో ఈడీ ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ మేటర్‌ను తవ్వి తీయడానికి రెడీ అయింది. ఈడీ ఎంట్రీతో...విదేశాలకు తరలిపోయిన హవాలా మనీ గుట్టు రట్టు కానుందా? ఇక్కడ దోచి, ఎక్కడో దాచిన సొమ్ము రహస్యాలు బయటకు వస్తాయా? సృష్టి సీక్రెట్స్ పూర్తిగా బయటపడనున్నాయా? ఇక వాట్ నెక్ట్స్!

డాక్టర్ నమ్రత అండ్ గ్యాంగ్ అరాచకాలపై ఈడీ నజర్ పెట్టింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో…ఈడీ రంగంలోకి దిగింది. కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేఖ రాసింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో జరిగిన అక్రమాలు, అరాచకాల నిగ్గు తేల్చడంతో పాటు…చేతులు మారిన, విదేశాలకు తరలిపోయిన కోట్లాది రూపాయల లావాదేవీల గుట్టు రట్టు చేయడానికి దర్యాప్తు సంస్థ నడుం బిగించింది. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో మనీ లాండరింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నమ్రత నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఈడీ రెడీ అయింది.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో డాక్టర్ నమ్రత..ఎనిమిది రాష్ట్రాల్లో తన అక్రమ దందాను సాగించారు. సరోగసీ ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్‌తో ఆమె కోట్లాది రూపాయలను కూడబెట్టారు. తక్కువ ధరకు పిల్లలను కొనుక్కుని వచ్చి….పిల్లలు లేని దంపతులకు సరోగసీ పేరుతో ఎక్కువ రేట్లకు అంటగట్టారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలను కొనుగోలు చేసి, సంతానం లేనివారికి వాళ్లను అమ్మినట్లు గుర్తించారు. 30 మంది అరెస్ట్ తర్వాత, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 80మంది పిల్లలను చేతులు మార్చేసి…పిల్లలు లేని జంటల నుంచి 25 కోట్ల రూపాయలు దర్జాగా కాజేసిన నమ్రత గ్యాంగ్..మనీ లాండరింగ్‌కు కూడా పాల్పడిందనే ఆరోపణలు, అనుమానాలు తెర పైకి వచ్చాయి. దీంతో సృష్టి క్లినిక్ ముసుగులో జరిగిన మనీ లాండరింగ్ మేటర్‌పై ఈడీ సీరియస్‌గా దృష్టి సారించింది.
కోట్లాది రూపాయలు విదేశాలకు తరలింపు!
MBBSలో తన బ్యాచ్‌మేట్లతో కలిసి పక్కా నెట్‌వర్క్ తయారు చేసిన డాక్టర్ నమ్రత…ఈ దందాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. IVF, సరోగసీ పేరుతో పిల్లలు లేని జంటల నుంచి రూ. 30 నుంచి 40 లక్షల దాకా వసూలు చేశారు. ఈ దందాలో KGH డాక్టర్లతోపాటు ప్రైవేటు వైద్యులు, ఏజెంట్లతో డీల్స్ కుదుర్చుకున్నారు నమ్రత. ఇక ఇలా పోగేసిన కోట్లాది రూపాయలను కొందరు డాక్టర్లు…హవాలా రూపంలో విదేశాలకు తరలించి అక్కడ పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ మేటర్‌లో….సుమారు రూ.40 కోట్ల మేర హవాలా రూపంలో లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కుంభకోణంలో సరిగ్గా ఇదే కోణంలో…మనీ లాండరింగ్ యాంగిల్‌లో ఈడీ విచారణ జరపనుంది.
ఇక ఈడీ ఎంటర్ అవడంతో సృష్టి రహస్యాలు పూర్తిగా బయటపడే చాన్స్ ఉంది. ఇక్కడ దోచి, ఎక్కడో దాచిన కోట్లాది రూపాయల సొమ్ము గుట్టు రట్టు కానుంది. ఈడీ ఎంట్రీతో సృష్టి అక్రమాల దందాలో మనీ లాండరింగ్ కోణం వెలుగులోకి రానుంది.
