భర్తను కిడ్నాప్ చేయించిన మొదటి భార్య.. చిన్న తప్పుతో మొత్తం కథ రివర్స్!
ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి, పేరు, మతం మార్చుకుని రెండో పెళ్లి చేసుకుని కుదురుగా కాపురం చేసుకుంటున్నాడు. అయితే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని 600 చదరపు గజాల స్థలాన్ని2 నెలల క్రితం విక్రయించగా రూ.22 కోట్లు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య సినీ ఫక్కీలో భర్తను కిడ్నాప్ చేసి, హత్య చేసి కోట్ల సొమ్మును కాజేయాలని స్కెచ్ వేసింది. అంతా అనుకున్నట్లే చేసింది. కానీ చివర్లో ఊహించని ట్విస్ట్‌లో అంతా రొచ్చురొచ్చయ్యింది. అంబర్‌పేటలోని కార్యాలయంలో పోలీస్ తూర్పుమండలం డీసీపీ బాలస్వామి అదనపు డీసీపీ నర్సయ్యతో కలిసి మంగళవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్, నవంబర్ 5: హైదరాబాద్‌లోని డీడీ కాలనీలో అక్టోబర్ 29న జరిగిన కిడ్నాప్ కేసును అంబర్‌పేట పోలీసులు చాకచక్యంగా ఆధారాలతో సహా ఛేదించారు. కరీంనగర్‌కు చెందిన మంత్రి శ్యామ్, ఆయన భార్య మాధవిలత (51) కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. శ్యామ్ తన పేరును అలీగా మార్చుకుని ఫాతిమా అనే మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య మాధవిలత బండ్లగూడ సన్‌సిటీలో పిల్లలతో నివాసం ఉంటుంది. అయితే ఇటీవల మాజీ భర్త శ్యామ్ బంజారాహిల్స్‌లో స్థలాన్ని విక్రయించగా డబ్బులు వచ్చాయని తెలుసుకున్న ఆమె భర్తను హత్య చేయించి, ఆ డబ్బు కాజేయాలని పన్నాగం పన్నింది. ఇందుకు రాంనగర్‌కి చెందిన కట్ట దుర్గాప్రసాద్ అలియాస్ సాయితో రూ.1.50 కోట్లకు బేరం కుదుర్చుకుంది. దుర్గా వినయ్‌తోపాటు రాంనగర్ నివాసి కట్ట దుర్గాప్రసాద్ అలియాస్ సాయితో కలిసి మాధవీలత కిడ్నాప్ ప్లాన్ చేశారు. రాంనగర్‌కు చెందిన దుర్గాప్రసాద్, విద్యానగర్‌కు చెందిన కాటమోని పురుషోత్తం, పురానాపూల్‌కు చెందిన సందోలు నరేష్‌కుమార్, ఆగాపురకు చెందిన కోశకోలు పవన్‌కుమార్, మంఘల్‌హాట్ నివాసి నారాయణ రిషికేష్‌సింగ్, అంబర్‌పేట పటేల్‌నగర్‌కు చెందిన పిల్లి వినయ్‌లతో కిడ్నాప్ కు ప్లాన్ చేశారు.
ఇందులో భాగంగా అంబర్‌పేట డీడీ కాలనీలో అక్టోబర 29న శ్యామ్ ని గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో శ్యామ్‌కు అతడి రెండో భార్య ఫాతిమా ఫోన్ చేసింది. అదే సమయంలో ఓ మహిళ శ్యామ్ ఫోన్ లిఫ్ట్ చేసి అది మౌలాలిలో దొరికిందని చెప్పింది. దీంతో అక్కడికి పరుగున వెళ్లిన ఫాతిమా ఆ ఫోన్ తీసుకొని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు జల్లెడ పట్టారు. కిడ్నాపర్లు రెంట్ కారు చెర్లపల్లి వద్ద వదిలి వెళ్లిపోయినట్లు గుర్తించారు. కారు నంబర్, యజమానిని గుర్తించి కారు అద్దెకు తీసుకున్నట్లు గుర్తించారు. కిడ్నాపర్లు కారును చర్లపల్లి వద్ద వదిలేసి మరో కారులో శ్యామ్‌ను విజయవాడ నగరశివారు ఇబ్రహీంపట్నంకు తీసుకొచ్చారు. అయితే శ్యామ్‌ను కిడ్నాప్ చేసి, మాధవిలత ఇంటికి తీసుకురావాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంతలో విచారణ నిమిత్తం ఆమెను పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లడంతో కథ అడ్డం తిరిగింది. కిడ్నాప్ చేసిన శ్యామ్‌ను ఎక్కడకు తీసుకెళ్లాల్లో తెలియక పలు చోట్లకు తిప్పారు.
కిడ్నాపర్లు రూ.30లక్షలు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు శ్యామ్ తన స్నేహితుడు రఘునాథ్‌రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు. గత నెల 31న బంజారాహిల్స్‌లోని ఓ బ్యాంకులో శ్యామ్ డబ్బులు డ్రా చేయడానికి వచ్చి తప్పించుకొని పోలీసులకు తెలియజేశాడు. దీంతో ఈ కేసు గుట్టు వీడింది. ఇందులో ప్రమేయమున్న మొదటి భార్య మాధవిలతతో సహా పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు పరార్ అయ్యారు. వీరికోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




