Hyderabad: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. మరమ్మత్తు పనులు వాయిదా.. మంచినీటి సరఫరా యథాతథం
భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది జలమండలి. నగరంలో చేపట్టిన మరమ్మత్తు పనులు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. దీంతో మంచినీటి సరఫరాను యధాతధంగా అందిస్తున్నట్లుగా హైదరాబాద్ జలమండలి ఓ ప్రకటన విడుదల చేసింది.
Hyderabad: ఓ వైపు గత ఐదు రోజులుగా హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారు.. ఈ నేపథ్యంలో మహానగరంలో నేడు మంచి నీటి సరఫరా బంద్ అంటూ ప్రకటించిన జలమండలి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది. మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్(కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్ – 1కి సంబంధించిన జంక్షన్ పనుల కోసం ఈ రోజు ఉదయం 6 గంటల నుండి రేపు (బుధవారం) సాయంత్రం 6 గంటల వరకు అంటే మొత్తం 36 గంటల పాటు నగరంలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి ఇంతకుముందు ప్రకటించింది. అయితే నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి సరఫరా పనులను తాత్కాలికముగా వేసినట్లు జలమండలి అధికారులు ప్రకటించారు. కనుక నగరంలోని అన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా యథాతథంగా కొనసాగుతుంది. మరమ్మత్తులు చేపట్టే తేదీలను తిరిగి ప్రకటిస్తామని పేర్కొంది.
అయితే నగరంలోని కేడీడబ్ల్యూఎస్పీ ఫేజ్ – 2, 3లో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూడు గంటల పాటు పాక్షికంగా నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జలమండలి ప్రకటించింది.
నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..