Hyderabad: నగరంలో న్యూ ఇయర్ వేడుకలకు ప్రిపేర్ అవుతున్నారా..? ముందు ఇది తెలుసుకోండి
నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో హోటళ్లు, క్లబ్‌లు, బార్ల నిర్వహణపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత ఈవెంట్లు నిర్వహించాలంటే ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరి. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి ..

నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా హోటళ్లు, క్లబ్‌లు, బార్ల నిర్వహణపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత ఈవెంట్లు నిర్వహించాలనుకునే సంస్థలు తప్పనిసరిగా పోలీసుల అనుమతి పొందాలని స్పష్టం చేశారు. ఇందుకు కనీసం 15 రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిబంధనల ప్రకారం.. పార్కింగ్ ప్రాంతాలు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ వద్ద పని చేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలనే ట్రాఫిక్ నియంత్రణకు తగినంత భద్రతా సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది.
డీజే, శబ్ద కాలుష్యంపై ఆంక్షలు
బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్లు, డీజేలు, సౌండ్ యాంప్లిఫయర్లు రాత్రి 10 గంటలకే నిలిపివేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్పష్టం చేశారు. అయితే ఇండోర్ రెస్టారెంట్లు, బార్లలో మాత్రం అనుమతి పొందినట్లయితే రాత్రి 1 గంట వరకు మ్యూజిక్‌కు వెసులుబాటు ఉంటుంది. సౌండ్ లెవల్ 45 డెసిబెల్స్‌ను మించకూడదు.
అశ్లీలత, మత్తుపదార్థాలకు తావులేదు
వేషధారణలో మర్యాద తప్పనిసరి అని పోలీసులు హెచ్చరించారు. అశ్లీలత, నగ్నత్వం ప్రదర్శనతో పాటు డ్రగ్స్, మత్తు పదార్థాల పంపిణీకి పూర్తిగా నిషేధం విధించారు.
టికెట్ల విక్రయంపై పరిమితులు
భారీగా టికెట్లు విక్రయించడంపై ఆంక్షలు విధించారు. అదుపుతప్పే జనసందోహం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పబ్‌లు, బార్లలో జంటల కోసం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు మైనర్లకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
మద్యం సేవించినవారికి సురక్షిత ప్రయాణం బాధ్యత మేనేజ్‌మెంట్‌దే
మద్యం సేవించిన కస్టమర్లకు క్యాబ్, డ్రైవర్ సౌకర్యం కల్పించే బాధ్యత ఆయా సంస్థలదేనని పేర్కొన్నారు. సురక్షితంగా ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
క్రాకర్స్ నిషేధం
పటాసుల వినియోగం పూర్తిగా నిషేధమని తెలిపారు. జిల్లా అగ్నిమాపక శాఖ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు
మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, రక్తంలో ఆల్కహాల్ లెవల్ 30 మి.గ్రా. మించినవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇందుకు రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలలు లేదా శాశ్వతంగా రద్దయ్యే అవకాశం కూడా ఉంది. మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమానులపైనే బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు. సైలెన్సర్ తొలగించిన ద్విచక్ర వాహనాలు, అతివేగం, ప్రమాదకర డ్రైవింగ్, రేసింగ్‌లపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. మహిళల భద్రత కోసం నగరమంతా షీ టీమ్‌లు మోహరించామని, మహిళలపై నేరాలకు పాల్పడితే తక్షణ చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.




