Nampally Fire Accident: ఎన్నో ప్రశ్నలు.. సమాధానాలు చెప్పేవారేరి..? నాంపల్లి అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగవంతం..
ఈ అగ్ని ప్రమాదం ఉదయం 9.30 గంటల సమయంలో జరిగింది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్ ఉండటంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చాయని కొందరు చెబుతున్నారు. అదే సమయంలో అక్కడ నిల్వ ఉంచిన డీజిల్, కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

Hyderabad Fire Accident: అపార్ట్‌మెంట్ సెల్లార్లో కెమికల్ బాంబ్.. సెల్లార్లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వచేసిన కెమికల్స్ ఏకంగా 9 మంది ప్రాణాలు తీశాయి. మరికొందరికి ఊపిరాడకుండా చేశాయ్. అదృష్టవశాత్తూ 12 మంది కొన ఊపిరితో బయటపడ్డారు. హైదరాబాద్ నాంపల్లి బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్నిప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం అయింది. భవన యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. భవన యజమాని రమేష్ జైష్వాల్‌కు ప్లాస్టిక్ తయారు చేసే ఇండస్ట్రీ ఉంది. దానికి సంబంధించిన కెమికల్ డ్రమ్స్‌ను ఈ అపార్ట్‌మెంట్ గ్రౌండ్‌ఫ్లోర్లో నిల్వచేశారు. 150 డబ్బాలకుపైనే ఇక్కడ ఉంచారు. ఇవాళ జరిగిన అగ్నిప్రమాదంలో ఒక్కసారిగా డబ్బాలు ఒక్కసారిగా పేలిపోయాయి. మంటలు, దట్టమైన పొగ క్షణాల్లోనే అపార్ట్‌మెంట్ మొత్తాన్ని చుట్టుముట్టేశాయి. ఆ సమయంలో 5 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో మొత్తం 21 మంది ఉన్నారు. వీరిలో నాలుగు నెలల చిన్నారి సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు బంధువుల ఇంటికి వచ్చి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా అక్కడ అద్దెకు ఉంటున్నవారేనని పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి గల కారణమేంటి..?
ఈ అగ్ని ప్రమాదం ఉదయం 9.30 గంటల సమయంలో జరిగింది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్ ఉండటంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చాయని కొందరు చెబుతున్నారు. అదే సమయంలో అక్కడ నిల్వ ఉంచిన డీజిల్, కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మొత్తంగా బెంజైల్ నైట్రేట్ రసాయనం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటున్నారు. బాణాసంచా వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని మొదట ప్రాథమికంగా అంచనాకు వచ్చినా.. అది కాదని.. మరేదైనా కారణ ఉంటుందనే దానిపైనా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. గాయపడ్డ వారికి కూడా చికిత్స కొనసాగుతోంది. ఆత్మీయుల్ని కోల్పోయిన బంధువుల రోదనలతో ఉస్మానియా దగ్గర పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. బజార్‌ఘాట్ అగ్నిప్రమాదంపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 304, 285, 286, ఐపీసీ 9 బీ(1) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. స్థానికులు, బాధితుల వివరాలను తీసుకుని.. హైదరాబాద్ పోలీసులు విచారణ ప్రారంబించారు. పరారీలో ఉన్న బిల్డింగ్ యజమాని రమేష్ జైష్వాల్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
పరిమితికి మించి అంతస్తులు
కాగా.. గ్రేటర్ పరిధిలో జరిగిన ప్రమాదాలు ఇప్పటికీ కళ్లముందే కదలాడుతున్నాయి. ఈ సమయంలో నాంపల్లి దుర్ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. స్వప్నలోక్ ఘటన సమయంలో జీహెచ్ఎంసీ అధికారులు నానా హడావుడి చేశారని.. అప్పుడు మున్సిపల్ శాఖ ఆధ్వరయంలో కమిటీ వేసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొంటున్నారు. కమిటీ ఏర్పాటు తర్వాత 200 మందికి నోటీసులు ఇచ్చినా.. చర్యలు శూన్యమని ఆరోపిస్తున్నారు. తాజాగా ప్రమాదం జరిగిన భవనానికి G+2కు మాత్రమే పర్మిషన్ ఉందని.. కానీ.. పరిమితికి మించి అంతస్తులు నిర్మించారు. ఈ భవనం మొత్తం.. నాలుగు ఫ్లోర్లు, పెంట్ హౌస్ నిర్మించారు.. మొత్తంగా ఈ ప్రమాదం.. నిర్లక్ష్యంగానే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నో ప్రశ్నలు.. సమాధానాలు చెప్పేవారేరి..?
అసలు జనావాసాల మధ్య కెమికల్ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారు..? ప్రమాదకర రసాయనాలు నిల్వ చేసినా ఎవరూ పట్టించుకోలేదా..? అనుమతులు ఉన్నాయో లేవో అడిగేవారే లేరా..? అసలు అపార్ట్‌మెంట్ సెల్లార్లు ఉన్నది పార్కింగ్ కోసమా.. గోడౌన్ల కోసమా..? వరుస ప్రమాదాలతోనైనా అధికారులు కళ్లు తెరుస్తారా..?.. GHMC రెగ్యులర్ తినిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయనే ఆరోపణలకు ఏం సమాధానం ఇస్తారో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా..
ఇదిలాఉంటే.. బాధిత కుటుంబాలను రాజకీయ పార్టీల నాయకులు పరామర్శిస్తూ అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. ప్రమాద స్థలిని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి సందర్శించారు. ప్రమాదానికి అసలు కారణాలేంటి అనే దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారికి ఉస్మానియా ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తామని, అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తామని తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.
ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీపీఐ నేత నారాయణ పరిశీలించారు.
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
నాంపల్లి ప్రమాదస్థలిని పరిశీలించిన కిషన్‌రెడ్డి.. మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి సాయం అందిస్తామని ప్రకటించారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. నగరంలో ఉన్న కెమికల్ గోడౌన్లను శివారు ప్రాంతాలకు తరలించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి
నాంపల్లి ప్రమాదంపై గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో 9 మంది మృతిచెందడం విషాదకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు గవర్నర్ తమిళిసై సంతాపం తెలిపారు.
రూ.50 లక్షలు ఇవ్వాలి..
నాంపల్లి ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీఐ నారాయణ.. ఇది ప్రభుత్వ వైఫల్యమంటూ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




