Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నిన్న రేసింగ్… ఇవాళ ఛేజింగ్.. అనంతగిరి హిల్స్ దగ్గర రెచ్చిపోయిన రేసర్లు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పోలీసులు బిజీగా ఉంటే... వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో కొందరు యువకులు అక్రమంగా కార్లు, బైక్ రేసింగ్‌లు నిర్వహించారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల మధ్య అటవీ ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. ఈ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఎయిర్ గన్‌లు, సైరన్‌లను అక్రమంగా వినియోగించినందుకు నిందితులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.

Hyderabad: నిన్న రేసింగ్... ఇవాళ ఛేజింగ్.. అనంతగిరి హిల్స్ దగ్గర రెచ్చిపోయిన రేసర్లు
Racing
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 16, 2023 | 6:26 PM

అనంతగిరి హిల్స్, ఆగస్టు 16:  నిన్న రేసింగ్… ఇవాళ ఛేజింగ్. ఎస్.. నిన్న బైక్ రేసింగ్‌తో రెచ్చిపోయిన ఓ కుర్ర బ్యాచ్ కోసం ఇవాళ ఛేజింగ్ చేస్తున్నారు పోలీసులు. పచ్చటి అనంతగిరి హిల్స్ ఏరియాలో కార్లు, బైకుల స్టంట్లతో నానాయాగీ చేసిందొక గుంపు. వాళ్లెవరు.. వాళ్లకది రొటీన్‌గా ఉండే అలవాటేనా? తేల్చే పనిలో ఉంది ఖాకీ శాఖ. ఒక్కసారి డీటెయిల్స్‌లోకి వెళదాం… తెలంగాణా ఊటీగా పేరున్న అనంతగిరి హిల్స్‌… పచ్చటి కొండలున్న ప్రాంతం. దగ్గర్లో కలెక్టరేట్లో ఇండిపెండెన్స్‌ డే సెలబ్రేషన్స్‌ జరిగాయి. అదే జోష్‌లో ఆ సమీపంలోని రెండున్నర ఎకరాల ఓపెన్ ల్యాండ్స్‌లో వెహికల్స్‌తో సర్కస్ ఫీట్లకు తెగించిందొక బ్యాచ్. ఒకవైపు టూరిస్టులు తిరిగే చోటు.. జనసంచారం ఉంది.. దాదాపు నడి రోడ్డు. ఒక్కసారిగా డజన్ల కొద్దీ బైకులు, కార్లు రయ్‌రయ్‌ మని సౌండ్ చేసుకుంటూ ధూమ్ సినిమా చూపిస్తుంటే… బెంబేలెత్తిపోయారు జనం. వాళ్లకైతే అదొక మజా.

ఎర్రమట్టి నేల కావడంతో… యాక్సిలేటర్ రైజ్ చేసినప్పుడల్లా దుమ్ము పైకి లేచి.. అదొక మజా క్రియేట్ అవుతుందట. అందుకే.. ఈ ఏరియా మీద తెగపడుతున్నారు రేసర్లు. వికారాబాద్‌లో ఏకంగా ధూమ్ సినిమా చూపిస్తున్నారు. గతంలో కూడా చాలాసార్లు ఇలాగే రేసింగులు జరిగినా పోలీసులు లైట్ తీసుకున్నారు. మంగళవారం కూడా పంద్రాగస్టు సందర్భంగా బిజీగా ఉండబట్టి ఈ స్టంట్‌ మాస్టర్లను పట్టించుకోలేదు అంటున్నారు పోలీసులు. యువకులు కార్లు, జీపులతో విన్యాసాలు చేస్తున్న వీడియో క్లిప్పులు బుధవారం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.

ఒక స్పోర్ట్స్ బైక్ బ్రాండ్‌కి సంబంధించిన బైకర్స్ క్లబ్బుల పనే ఇదని చెబుతున్నారు. ఎప్పుడూ కాశ్మీర్‌, లడఖ్ లాంటి లాంగ్‌ ట్రిప్పులేస్తారు. బోరుకొట్టినప్పుడల్లా ఇలా అనంతగిరి హిల్స్‌ దగ్గరకొచ్చి స్టంట్స్‌తో దుమ్ము లేపుతుంటారు. నిన్నయితే దాదాపు 60 నుంచి 70 బైకులు, పాతిక పైగా కార్లు. మనల్నెవడ్రా ఆపేది అంటూ రెచ్చిపోయారు. ఒకే ఒక్క కారు డీటెయిల్స్ దొరికాయి. మిగతా వాళ్లను ట్రేస్ చేస్తున్నాం అంటున్నారు పోలీసులు.  ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఈ వికృత ధోరణిని కంట్రోల్ చేయాలని పర్యాటకులు,  స్థానిక ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇలా పెడదోవ పట్టిన స్థితిమంతుల పిల్లలకు చెక్ పెట్టి.. వారి భవిష్యత్‌ను కాపాడాలని.. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకుడు పి.కార్తీక్ రెడ్డి వికారాబాద్ పోలీసు సూపరింటెండెంట్‌ను కోరారు. కాగా కొన్ని కేటగిరీల వాహనాలకు మాత్రమే అటవీ ప్రాంతాల్లో సైరన్‌లను ఉపయోగించేందుకు అనుమతి ఉంది. అయినప్పటికీ, చాలా మంది  నిబంధనలను అపహాస్యం చేస్తూ వన్యప్రాణులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.