AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఫ్లైఓవర్ కింద ప్లే గ్రౌండ్.. అరె.. భలే థాట్ గురూ..

కేపీహెచ్​బీలోని నెక్సస్ మాల్ ముందు ఉన్న ఫ్లైఓవర్ కింద క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణాల్లో వివిధ రకాలైన ఆటలు ఆదుకునేందుకు అనుగుణంగా ఇవి తీర్చిదిద్దబడ్డాయి. రూ. 78 లక్షలతో 11500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎకో డిజైన్ సంస్థ ప్రతినిధులు స్పోర్ట్స్ ఎరీనాను అభివృద్ధి చేస్తున్నారు.

Hyderabad: ఫ్లైఓవర్ కింద ప్లే గ్రౌండ్.. అరె.. భలే థాట్ గురూ..
Playground
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Aug 22, 2024 | 9:10 PM

Share

హైదరాబాద్ మహా నగరం రోజురోజుకీ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా క్రీడల పట్ల యువతకు ఉన్న ఆసక్తిని గుర్తించి అధికారులు చేయూతను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. హైదరాబాద్ నగరం అంటే సామాన్యంగా ఎత్తైన ఫ్లైఓవర్లను మనం చూస్తూనే ఉంటాం. ఆ ఫ్లైఓవర్లను పార్కింగ్ స్థలాలుగా, గార్డెన్లుగా మాత్రమే చూసి ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ స్థలం సరికొత్త రకంగా మన ముందుకు రాబోతుంది. అదెలా అంటారా?.. నగరంలోని కేపీహెచ్​బీలో ఫ్లైఓవర్ కింద క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. గ్రేటర్ హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా కేపీహెచ్​బీలో ఈ క్రీడా ప్రాంగణం ఏర్పాటు అవడం గమనార్హం.

కేపీహెచ్​బీలోని నెక్సస్ మాల్ ముందు ఉన్న ఫ్లైఓవర్ కింద క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణాల్లో వివిధ రకాలైన ఆటలు ఆదుకునేందుకు అనుగుణంగా ఇవి తీర్చిదిద్దబడ్డాయి. రూ. 78 లక్షలతో 11500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎకో డిజైన్ సంస్థ ప్రతినిధులు స్పోర్ట్స్ ఎరీనాను అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఇదివరకే ముంబై మహా నగరంలో స్పోర్ట్స్ ఎరీనా అమలులో ఉంది. ఈ ఎరీనా అంటే ఓపెన్ ఎయిర్ క్రీడలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఇది అనువైన స్థలం అన్నమాట. కేపీహెచ్​బీలో ఏర్పాటు చేసిన ఎరీనా 24*7 అద్దె ప్రాతిపదికన క్రీడాకారులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పనులు తుది దశకు చేరడంతో దీన్ని వచ్చే సెప్టెంబర్ నెలలో వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనిపై మూసాపేట్ సర్కిల్ డీఈ ఆనంద్ మాట్లాడుతూ.. కేపీహెచ్​బీలో ఏర్పాటు చేసిన ఎరీనా అద్దెను నెలకు లక్ష రూపాయలుగా నిర్ణయించినట్లుగా తెలిపారు. ఐదు లక్షల అడ్వాన్స్, ఆన్ లైన్ టెండర్ ద్వారా మెయింటనెన్స్ కింద స్పోర్ట్స్ ఎరీనాను ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే అందుబాటులోకి తెస్తామని, తద్వారా కేపీహెచ్​బీ ప్రాంత ప్రజలకు ఈ ఎరీనా ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

ఈ ఎరీనాలో ఏం ఏం ఉన్నాయంటే?

కేపీహెచ్​బీలో ఏర్పాటు చేసిన ఈ క్రీడా ప్రాంగణంలో రెండు కోర్టులు ఏర్పాటు చేశారు. ఈ కోర్టుల్లో క్రికెట్, బాస్కెట్ బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఫుట్ బాల్, షటిల్ వంటి ఎన్నో రకాలైన ఆటలు ఆదుకునేందుకు సౌకర్యంగా ఉంటుంది. చిన్నారులు స్కెటింగ్ చేసుకునేందుకు కూడా మార్కింగ్ చేశారు. చిన్నపిల్లలు చెస్, స్నేక్ ల్యాడర్ మొదలైన ఆటలు ఆడేందుకు దీన్ని తీర్చిదిద్దారు. ఇంతే కాకుండా వివిధ ఆటల్లో పిల్లలతో పాటు పెద్దవారికి సైతం శిక్షణ కూడా ఇవ్వనున్నారు. క్రీడా ప్రాంగణం చుట్టూ ప్రముఖ క్రీడాకారుల ఫోటోలు ఏర్పాటు చేశారు. క్రీడాకారులు సామాగ్రి, మొదలైన వస్తువులు పెట్టుకునేందుకు లాకర్లు, అక్కడే ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు వాహనాల పార్కింగ్ సౌకర్యం కూడా అందించనున్నారు. అందంగా తీర్చిదిద్దిన ఈ క్రీడా ప్రాంగణం అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడడంతో పాటు సౌకర్యవంతంగా ఉండనున్నట్లు అర్థమవుతోంది.

ఇవే కాకుండా, కూకట్ పల్లి జోన్ పరిధిలో మరో మూడు క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సైతం చర్యలు కొనసాగుతున్నాయి. కైత్లాపూర్ ఆర్వోబీ, బాలానగర్ ఫ్లైఓవర్ కింద భాగంలో ఇలాంటి క్రీడా ప్రాంగణాలే ఏర్పాటు చేసి మరింతగా అభివృద్ధి చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. యువతను, చిన్నారులను క్రీడల్లో ప్రోత్సహించే దిశగా ఇలాంటి చర్యలకు హైదరాబాద్ నగరం విస్తరించడం నగరవాసులు హర్షించదగ్గ పరిణామం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..