Fire Accident: కుషాయిగుడలో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఆరు షాపులు, వ్యాన్
Fire Incident at kushaiguda: హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో నాలుగు కూలర్ షాపులు ఒక ప్లాస్టిక్ షాప్, ఫర్నిచర్ షాప్, దుస్తుల షాపుతో పాటు ఒక డీసీఎం వ్యాన్ పూర్తిగా
Fire Incident at kushaiguda: హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో నాలుగు కూలర్ షాపులు ఒక ప్లాస్టిక్ షాప్, ఫర్నిచర్ షాప్, దుస్తుల షాపుతో పాటు ఒక డీసీఎం వ్యాన్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఫైర్ సిబ్బంది వచ్చేసరికి షాపులన్నీ కాలి బూడిదయ్యాయి. మంటలు మిగతా ప్రాంతాలకు వ్యాపించి భారీ ప్రమాదం జరగకుండా ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. వేసవి కాలం కావడంతో సీజనల్ బిజినెస్‌లో భాగంగా కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట కొంతమంది కూలర్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆదివారం రాత్రి షాపులకు మంటలు అంటుకున్నాయని పోలీసులు వెల్లడించారు. నిమిషాల వ్యవధిలోనే మొత్తం ఆరు షాపులు కాలి బూడిదయ్యాయన్నారు. డీసీఎం వాహనం సైతం అగ్నికి ఆహుతయ్యింది. అగ్ని మాపక సిబ్బంది వేగంగా స్పందించి.. మిగతా ప్రాంతాలకు మంటలు విస్తరించకుండా అదుపులోకి తీసుకొచ్చారు.
కాగా.. తమ షాపులు అగ్నికి ఆహుతి కావడంతో బాధితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అప్పు చేసి పెట్టుకున్న షాపులన్నీ క్షణాల్లో దగ్ధమైపోయాయంటూ కన్నీరుమున్నీరవుతన్నారు. అయితే.. షాపులు పూర్తిగా ప్రారంభించక ముందే అగ్ని ప్రమాదం జరగడంపై బాధితులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు కావాలనే ఈ కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. దీంతో పలువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
సంఘటన స్థలానికి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి, ఏసీపీ శివ కుమార్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మొదట షార్ట్ సర్క్యూట్ అని భావించినప్పటికీ.. బాధితుల ఆరోపణలు బట్టి విచారణ చేపడుతామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: