Telangana: పదో తరగతి విద్యార్థులకు సూపర్ న్యూస్.. సాయంత్రం అదిరిపోయే స్నాక్స్, మెనూ ఇదే
పదో తరగతి చదువుతున్న గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్‌కు పండుగ లాంటి వార్త. ఇకపై వారి ఈవెనింగ్ స్నాక్స్ కూడా అందనున్నాయి. వార్షిక పరీక్షలు నేపధ్యంలో ఇకపై ప్రత్యేక తరగతులు జరగనున్నాయి. ఈ నేపధ్యంలోనే విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి పరీక్షల కోసం అదనపు క్లాసుల నిర్వహణ ప్రిపరేషన్ జరుగుతున్న సమయంలో విద్యార్థుల ఆకలిని తీర్చేందుకు మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం స్నాక్స్ అందించాలని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కు స్నాక్స్ అందించ నున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లతో పాటు మోడల్ స్కూళ్లలోనూ దీన్ని అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు.
పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం 6 రకాల స్నాక్స్ అందించనున్నారు. వారంలో ఒకరోజు బాయిల్డ్ బబ్బర్లు, ఆనియన్ పకోడా, ఆనియన్ శనగలు, బాయిల్డ్ పెసర్లు, పల్లి బెల్లం, మిల్లెట్ బిస్కెట్లు అందించాలని అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఒక్కో స్టూడెంట్ కు రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులను స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఖాతాల్లో వేయనున్నారు.
రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకూ పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. సర్కారు బడుల్లో ఉత్తీర్ణత శాతం పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ అన్ని బడుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం అన్ని బడుల్లో ఉదయం 8.30గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా స్పెషల్ క్లాసులు జరుపుతున్నారు. మధ్యాహ్నం 1 గంట కి పాఠశాలలో భోజనం చేసిన విద్యార్థులు సాయంత్రం 5 గంటలకు మళ్లీ ఆకలి అంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు బడుల్లో టీచర్లు, కొందరు ఎన్జీవోల ద్వారా నిధులు సేకరించి స్నాక్స్ అందిస్తున్నారు. ఇదే క్రమంలో అందరు విద్యార్థులకు దీన్ని అమలు చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వంమే స్వయంగా స్నాక్స్ అందించాలని నిర్ణయించింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి