భార్య కోసం వెతికి ఆసుపత్రి పాలైన భర్త..సీన్ కట్ చేస్తే.. పక్క బెడ్‌పైనే అతడి భార్య!
భార్య తప్పిపోయిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె కోసం వెదికి వేసారిన అతని కంటిచూపు మందగించింది. ఆసుపత్రిలో చేరి కంటిశుక్లం ఆపరేషన్ చేయించుకున్నాడు. తీరా కళ్లు తెరిచి చూస్తే పక్క బెడ్‌పైనే భార్య ప్రత్యక్షం కావడంతో అతని ఆనందానికి అవధుల్లేవు. సినిమాల్లో ఈ సీన్ బోలెడు సార్లు చూసే ఉంటాం. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో నిజంగానే జరిగింది. కేవతా తలాబ్ బస్తీకి చెందిన రాకేశ్‌కుమార్ భార్య శాంతీదేవి జనవరి 13 నుంచి కనిపించకుండా పోయింది. భర్తకు చెప్పకుండా ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కోసం చాలా చోట్ల తిరిగి ఎంతగానో వెదికి మానసిక వేదనకు గురయ్యాడు రాకేశ్.
చివరకు స్నేహితుడి ఇంట్లో ఉంటూనే వెతుకులాట కొనసాగించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఫోటోలను అధికారులు.. ఇతర స్టేషన్లకు పంపించారు. అదే సమయంలో ఆవేదనతో మాసికంగా కుంగిపోయాడు. ఆరోగ్యం దెబ్బతింది. అతడి కంటిచూపు మందగించింది. వైద్యుల సలహాతో ఉన్నావ్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఫిబ్రవరి 6న కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత కళ్లకు ఉన్న కట్టును వైద్యుడు జాగ్రత్తగా తొలగిస్తున్న సమయంలో రాకేశ్‌కు బాగా సుపరిచితమైన గొంతు వినిపించింది. కళ్లు తెరిచి చూసి ఆనందంతో పొంగిపోయాడు తన పక్కనే ఉన్న 19వ నెంబరు బెడ్‌పై భార్య శాంతీదేవి ఉంది. 25 రోజుల తర్వాత ఆమె కనిపించడంతో సంతోషాన్ని ఆపుకోలేక వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి ఎక్కడికి వెళ్లావ్? ఏమైపోయావ్? అంటూ ప్రశ్నలు కురిపించాడు. ఆమె సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది. భర్తనీ గుర్తుపట్టలేదు. తలకు బలమైన గాయం కావడంతో ఎవరో శాంతీదేవిని ఆస్పత్రిలో చేర్పించారట. ఆమెకు మరిన్ని రోజులు మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం :