అప్పుడు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు.. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థి.. ఈటల పొలిటికల్ జర్నీ ఇది..
Etela Rajender Telangana Election 2023: తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆయనే తొలి ఆర్ధికమంత్రిగా పని చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఒకప్పుడు ఆయన మంచి మిత్రుడు. టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఈటెల..

Etela Rajender Telangana Election 2023: తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆయనే తొలి ఆర్ధికమంత్రిగా పని చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఒకప్పుడు ఆయన మంచి మిత్రుడు. టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఈటెల.. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల కథనరంగంలో కత్తులు దూస్తున్న రాజకీయ ప్రత్యర్థి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1984లో ఈటెల రాజేందర్ బీఎస్‌సీలో డిగ్రీ పట్టా అందుకున్నారు. టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల పాటు ఆర్ధిక మంత్రిగా.. అలాగే రెండేళ్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా తన సేవలు అందించారు ఈటెల రాజేందర్. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు ఈటెల రాజేందర్. ఆ తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో మళ్లీ గెలిచారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో భారతీయ జనతా పార్టీ తరపున హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీలోకి దిగారు ఈటెల రాజేందర్.
రాజకీయ జీవితం ఇలా..
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుంచి గెలుపొందిన ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి(ప్రస్తుతం బీఆర్ఎస్) ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. ఈటల రాజేందర్ 2003లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరి, 2004 ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటి చేసి.. టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2008 ఉప ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ హయాంలో టీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటెల తన వాగ్ధాటితో అందరిని ఆకట్టుకున్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గం హుజూరాబాద్‌గా మారింది. ఆయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వకుళాభరణం కృష్ణమోహన్ రావుపై, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ముద్దసాని దామోదర రెడ్డిపై గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డిపై గెలిచారు ఈటెల రాజేందర్. అలాగే కెసీఆర్ తొలి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అటు 2019లో కేసీఆర్ రెండవ మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఈటెల రాజేందర్.
వివాదం.. బర్తరఫ్.. రాజీనామా..
ఇదిలా ఉండగా.. 2021లో ఈటెల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో అదే ఏడాది మే 1న ఆయన నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బదిలీ జరిగింది. ఆ వెంటనే మే 2న మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్‌ను బర్తరఫ్ చేశారు. అనంతరం ఈటెల రాజేందర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను 2021 మే 31న కలిశారు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి 2021 జూన్ 12న రాజీనామా చేసి.. జూన్ 4న ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు ఈటెల రాజేందర్. అక్టోబర్ 30న జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పోటీ చేసి 23, 855 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక 2023, జులై 4న బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా కేంద్ర పార్టీ హైకమాండ్ ఈటెల రాజేందర్‌ను నియమించిన విషయం తెలిసిందే.
ఎన్నికల ఫలితాలు వేరుగా ఉంటాయి..
ఎన్నికల ఫలితాలు సర్వే సంస్థలకు అందని విధంగా ఉంటాయన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్. రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారాయన. హుజురాబాద్ ప్రజలు తనను ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈటల రాజేందర్.
మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..