AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఎకరాకు ఎన్ని వేల పరిహారమంటే..

గతంలో రూ. 4 లక్షలుగా ఉన్న నష్టపరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కంటింజెన్సీ ఫండ్ కింద వర్షాలు, వదరలతో అతలాకుతలమైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Telangana: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఎకరాకు ఎన్ని వేల పరిహారమంటే..
CM Revanth Reddy
Prabhakar M
| Edited By: |

Updated on: Sep 02, 2024 | 2:30 PM

Share

తెలంగాణలో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.. ఈ క్రమంలో భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గతంలో రూ. 4 లక్షలుగా ఉన్న నష్టపరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కంటింజెన్సీ ఫండ్ కింద వర్షాలు, వదరలతో అతలాకుతలమైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఖమ్మం పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

చనిపోయిన పాడి గేదెలు ఒక్కో దానికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 30 వేల నుంచి రూ. 50 వేలకు పెంచాలని, మరణించిన మేకలు, గొర్రెలకు ఒక్కోదానికి ఇచ్చే రూ. 3 వేల సాయం రూ.5 వేలకు పెంచాలని సీఎం ఆదేశించారు. తక్షణం బాధిత కుటుంబాలకు అందించాలని సూచించారు. వర్షాలు, వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి రూ. 10 వేల చొప్పున పంట నష్ట పరిహరం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయలని ఆదేశించారు.

రాష్ట్రంలోనే కాకుండా, జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు 24 గంటలు పని చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని చెప్పారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, నిత్యావసర వస్తువుల పంపిణీ, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టంపై అన్ని విభాగాల నుంచి ప్రాథమిక నివేదికలు తెప్పించి, కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సాయం కోరేందుకు నివేదికను సమర్పించాలని ఆదేశించారు.

రాష్ట్రంలో జరిగిన ఈ ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ అధికార బృందాలతో పాటు స్వయంగా ప్రధానమంత్రి ఈ విపత్తును పరిశీలించేందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (TGDRF) ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. 25 పెద్ద టవర్లు కూలిపోయినప్పటికీ విద్యుత్తు సిబ్బంది వెంటనే కరెంట్ సరఫరాను పునరుద్ధరించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అదే విదంగా 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్తు సమస్యలు, ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని గుర్తించి తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించి నష్టాలను నివారించాలని చెప్పారు. వాగులు, వంకలు పొర్లుతున్న దృష్ట్యా దెబ్బతిన్న రోడ్లు, వరద ప్రవహిస్తున్న రోడ్లపై నుంచి ఎవరూ దాటే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రెవిన్యూ, పోలీసు, ఇతర విభాగాల అధికారులు బృందాలు ఏర్పడి అన్ని చోట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..