AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ శివార్లలో కల్తీ ఆహార తయారీ ముఠా గుట్టురట్టు.. లక్షల రూపాయల సరుకు సీజ్!

హైదరాబాద్ నగర శివార్లలో గడువు ముగిసిన ముడిసరుకులు, ప్రమాదకర రసాయనాలు, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న ఒక అక్రమ కేంద్రాన్ని సైబరాబాద్ సీపీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బాహాటం చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూరు గ్రామంలో ఉన్న M/s KSM ఫుడ్ ప్రోడక్ట్స్ తయారీ కేంద్రంపై ఆకస్మిక దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ శివార్లలో కల్తీ ఆహార తయారీ ముఠా గుట్టురట్టు.. లక్షల రూపాయల సరుకు సీజ్!
Adulterated Food
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Aug 15, 2026 | 5:08 PM

Share

హైదరాబాద్ శివార్లలో కల్తీ, గడువు ముగిసిన ముడిసరుకులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న అక్రమ కేంద్రంపై సైబరాబాద్ సీపీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూరులో ఉన్న M/s KSM ఫుడ్ ప్రోడక్ట్స్ తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.4.07 లక్షల విలువైన ఆహార పదార్థాలు, ముడిసరుకులను స్వాధీనం చేసుకున్నారు.

KSM ఫుడ్ ప్రోడక్ట్స్ యజమాని మహ్మద్ ఖాలీద్, మేనేజర్ సంతోష్ కుమార్ కలిసి ఈ దందాకు తెరలేపినట్లు పోలీసులు తెలిపారు. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో.. గడువు ముగిసిన ముడిసరుకులు, లేబుళ్లు లేని సువాసన ద్రవ్యాలను ఉపయోగించి ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

టాస్క్‌ఫోర్స్ దాడిలో సుమారు 1,560 జార్ల సోన్ పాపిడి, కాటన్ సోన్ పాపిడి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.26 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అలాగే 240 జార్ల పల్లి పట్టీ, చిక్కీని సీజ్ చేశారు. వీటి విలువ రూ.34,800గా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

తనిఖీల్లో లేబుల్ లేని డైరీ మిల్క్, బనానా, ఫ్రెష్ మిల్క్, టేబుల్ బటర్, మిల్కీ బటర్ ఫ్లేవర్లతో పాటు కోకో పౌడర్, సుమారు 670 కిలోల లేబుల్ లేని బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.38,500గా పోలీసులు వెల్లడించారు. మరోవైపు గడువు ముగిసిన ఫ్లేవర్లు, డ్రైఫ్రూట్స్, కొబ్బరి పొడి, 72 బస్తాల మైదాను కూడా గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.1.08 లక్షలు ఉంటుందని తెలిపారు. తయారీ కేంద్రంలో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం టాస్క్‌ఫోర్స్ పోలీసులు H-FAST, GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించి.. నిందితులను, స్వాధీనం చేసుకున్న సరుకును అప్పగించారు. కేసు Cr.No.659/2026 కింద 275, 318(4) BNS సెక్షన్లతో ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో తయారీ తేదీ, Expiry/Best-Before తేదీ, బ్యాచ్ నంబర్, పదార్థాల వివరాలు, లేబులింగ్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు సూచించారు. గడువు ముగిసిన లేదా నాణ్యత లేని ఆహార పదార్థాలను కొనుగోలు చేయవద్దని.. కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై అనుమానం ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us