బుల్లితెరపై యాంకర్‌గా రాణించి, వెండితెరపై విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనసూయ భరద్వాజ్.
అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది అనసూయ. ఇటీవల హిందూ ధర్మంపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
సనాతన ధర్మాన్ని అవమానించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు అనసూయ.
నా మాటలను కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారు. అందుకే ఈ వివరణ ఇవ్వాల్సి వస్తోంది. నేను మాట్లాడింది కొంతమంది గురించి మాత్రమే.
నాపై అభ్యంతర కామెంట్లు చేస్తూ, వ్యక్తిగత దాడులు, బెదిరింపులకు దిగే వాళ్ల గురించే నేను చెప్పాను. అది ఏ మతాన్ని గానీ, వర్గాన్ని గానీ ఉద్దేశిస్తూ చెప్పిన మాట కాదు.
నన్ను టార్గెట్ చేస్తున్న వాళ్లకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. నేను సనాతన ధర్మాన్ని పాటించే హిందువుని.
నా ధర్మం, విలువలు, విశ్వాసాల పట్ల నాకు ఎలాంటి చింత లేదు. ధైర్యంగా ఉండటం.. నిజం వైపు నిలబడటం, తప్పును తప్పు అని చెప్పడం, ఎదుటివారిని మనిషిగా గౌరవించడం.. ఇవన్నీ నాకు ధర్మమే నేర్పింది. అని తెలిపింది.
'రంగస్థలం', 'పుష్ప' వంటి సినిమాలతో నటిగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న అనసూయ, ప్రస్తుతం మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులతో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా దూసుకుపోతున్నారు.