Hyderabad: శివబాలకృష్ణ కేసు దర్యాప్తుపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక
తీగలాగితే శివబాలకృష్ణ అక్రమాస్తుల డొంక కదిలింది. హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ ఆదాయానికి మించి ఆర్జనకు సహకరించిన ఐఏఎస్‌ల పాత్ర కూడా బయటికొస్తోంది. ప్రస్తుతానికి అరవింద్ కుమార్ పేరు మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది. దీంతో ఆయనను విచారించాలని డిసైడ్ అయింది ఏసీబీ.
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఏసీబీ విచారణలో పలువురు ఐఏఎస్ అధికారుల పేర్లు బయటకు వచ్చాయని సమాచారం. ఇందులో హెచ్‌ఎండీఏ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బాలకృష్ణ తన కన్‌ఫెషన్ స్టేట‌్‌మెంట్‌లోనూ అరవింద్ పేరు ప్రస్తావించడంతో ఆయను విచారించాలని ఏసీబీ డిసైడ్
బాలకృష్ణ కేసు దర్యాప్తుపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించింది ఏసీబీ. కస్టడీలో బాలకృష్ణ చెప్పిన విషయాలు.. ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రకు సంబంధించిన వివరాలను రిపోర్ట్‌లో పొందుపరిచారు. అలాగే అరవింద్‌ను విచారించేందుకు ప్రభుత్వం అనుమతి కోరింది ఏసీబీ. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
శివబాలకృష్ణ 8ఏళ్లలో పది సెల్‌ఫోన్లు, 9 ల్యాప్‌టాప్‌లు వాడినట్టు ఏసీబీ గుర్తించింది. అక్రమాస్తులకు సంబంధించిన వివరాలన్నీ ల్యాప్‌టాప్, హార్డ్ డిస్క్‌లో సేవ్ చేసినట్టు నిర్ధారించారు. మరోవైపు బాలకృష్ణకు చెందిన 31మంది కుటుంబసభ్యుల ఎలక్ట్రానిక్ డివైస్, సెల్‌ఫోన్స్ కూడా సీజ్ చేశారు. అందులో డేటాను సేకరించే పనిలో పడ్డారు. ఇందుకు ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకుంటున్నారు. ఆ సమాచారం బయటికొస్తే చాలా విషయాలు తెలిసే ఛాన్స్ ఉందంటున్నారు ఏసీబీ అధికారులు.
శివబాలకృష్ణ ఆస్తులు ఇప్పటికే ఐదు వందల కోట్ల రూపాయలు దాటాయి. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటంతో ఆయన అక్రమాస్తులను బాగానే వెనకేశాడన్న అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ ఇళ్లల్లో సోదాల సమయంలో కస్టడీలో ఐఏఎస్‌ల పేర్లు బయటకు వచ్చాయంటున్నారు అధికారులు. మొత్తం మీద శివబాలకృష్ణ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఐఏఎస్‌ల మెడకు చుట్టుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.