Hyderabad: గంజాయి మత్తులో కారు డ్రైవింగ్.. మితిమీరిన వేగంతో బీభత్సం.. ఒకరి పరిస్థితి విషమం..

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఓ యువకుడు మద్యంతో పాటు గంజాయి సేవించి ఆ మత్తులో తేలియాడుతూ కారును నడిపి అత్యంత వేగంగా వచ్చి ఓ బైకును ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు..

Hyderabad: గంజాయి మత్తులో కారు డ్రైవింగ్.. మితిమీరిన వేగంతో బీభత్సం.. ఒకరి పరిస్థితి విషమం..
Ganja
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 05, 2023 | 7:18 PM

మద్యం సేవించి వాహనాలను నడపొద్దంటూ పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా.. కొందరు యువకులు మాత్రం వాటిని పెడిచెవిన పెట్టేస్తున్నారు. మద్యం కాదు.. ఏకంగా గంజాయి సేవించి మరీ మత్తులో తూలుతూ వాహనాలను నడిపి రోడ్డుపై బీభత్సం సృష్టిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఓ యువకుడు మద్యంతో పాటు గంజాయి సేవించి ఆ మత్తులో తేలియాడుతూ కారును నడిపి అత్యంత వేగంగా వచ్చి ఓ బైకును ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉనట్టు తెలుస్తోంది.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని క్రీం స్టోన్ దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పీకలదాకా మద్యం సేవించిన ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి కారులో అత్యంత వేగంగా వచ్చి బైకును ఢీకొట్టాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కారును వెంబడించి అడ్డగించారు. కారును పరిశీలించగా అందులో 50 గ్రాముల గంజాయితో పాటు గంజాయితో నింపిన సిగరెట్లు కనిపించాయి. కారు నడుపుతున్న యువకుడు అనూష్ రావుగా గుర్తించారు.

దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ముదికొండ అనూష్ రావు బీబీఏ చదివి ఉద్యోగం లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. కొత్తపేటకు చెందిన స్నేహితుడు పవన్ కళ్యాణ్ రెడ్డితో కలిసి రాత్రి శంషాబాద్‌లోని ఓ ఈవెంట్లో మద్యం సేవించడంతో పాటు గంజాయి తీసుకున్నారు. ప్రమాదం తరువాత మద్యం మత్తులో ఉన్న ఆ యువకుల రక్తనమూనాలు, వెంట్రుకల నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు పోలీసులు. అనంతరం NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రమాదంలో గాయపడిన యువకులను పోలీసులు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అజ్మీత్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం