Thalassemia: తలసేమియాతో బాధపడుతున్న మూడేళ్ళ బాలుడు.. ప్రాణాల కోసం రక్తం ఎక్కిస్తే.. ప్రాణాంతక వ్యాధి సోకిన వైనం

తలసేమియాతో బాధపడుతున్న బాధితులు ఎక్కువగా బ్లడ్ బ్యాంక్ ఫై ఆధారపడతారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌ వారి నుంచి రక్తం సేకరించి బాధితులు రక్తం ఎక్కించుకుంటారు. అయితే ఇలా రక్తం మార్పిడి చేసుకున్న కొంతమంది చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం సంచలనం రేపుతోంది.

Thalassemia: తలసేమియాతో బాధపడుతున్న మూడేళ్ళ బాలుడు.. ప్రాణాల కోసం రక్తం ఎక్కిస్తే.. ప్రాణాంతక వ్యాధి సోకిన వైనం
Thalassemia Transmission
Surya Kala

| Edited By: Ravi Kiran

Aug 09, 2022 | 4:06 PM

Thalassemia: తలసేమియా (Thalassemia) అనేది జన్యుపరమైన వ్యాధి. ఎక్కువగా ఈ వ్యాధి తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమిస్తుంది.  ఈ వ్యాధితో బాధపడే వారికి శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి అవదు. ఈ సమయంలో రోగి శరీరంలో రక్తం లేకపోవడం.. అటువంటి పరిస్థితిలో అనేక ఇతర ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇది రక్తహీనత, అలసటకు కారణమవుతుంది. తలసేమియాతో బాధపడేవారికి రెండు వారాలకు ఓసారి వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఇలా రక్త మార్పిడి జీవించినంత కాలం వారికి ఇలా చేయాల్సిందే. ఈ వ్యాధి బారిన పడిన వారికి సరిపడా రక్తం అందించడం కోసం.. బ్లడ్ బ్యాంకులు రక్త దాతల నుంచి రక్తాన్ని సేకరించి భద్రపరుస్తుంటాయి. వ్యాధిగ్రస్తులకు అవసరమైన బ్లడ్‌ను అందిస్తుంటాయి. రక్తం సేకరించి నిల్వ చేసే క్రమంలో బ్లడ్ బ్యాంకులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దాత నుంచి రక్తం స్వీకరించే ముందు.. రక్త దాతకు హెచ్ఐవీ సహా రకరకాల పరీక్షలు నిర్వహిస్తారు పరీక్షల అనంతరం బ్లడ్ సురక్షితం అని నిర్ధారించుకున్న తర్వాత ఆ రక్తాన్ని నిల్వ చేస్తారు. అవసరమైన వారికి ఆ రక్తాన్ని అందిస్తారు. ముఖ్యంగా తలసేమియాతో బాధపడుతున్న బాధితులు ఎక్కువగా బ్లడ్ బ్యాంక్ ఫై ఆధారపడతారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌ వారి నుంచి రక్తం సేకరించి బాధితులు రక్తం ఎక్కించుకుంటారు. అయితే ఇలా రక్తం మార్పిడి చేసుకున్న కొంతమంది చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం సంచలనం రేపుతోంది. తాజాగా ఇటువంటి ఘటన తెలంగాణాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

రంగారెడ్డి జిల్లా రాంపల్లి గ్రామానికి చెందిన మూడేళ్ళ బాలుడు పుట్టుకతోనే తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో బాలుడు బతికి బట్టకట్టాలంటే ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైద్యుల సూచనతో హైదరాబాద్‌లోని నల్లకుంట పరిధిలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో గత రెండున్నరేళ్లుగా ఆ చిన్నారికి ప్రతి 15 రోజులకు ఓసారి రక్తం ఎక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 20వ తేదీన కూడా బాబుకు బ్లడ్ ఎక్కించారు. ఇటీవల డాక్టర్ సలహాతో బాబుకి బ్లడ్ టెస్ట్ చేశారు. రిజల్ట్ లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.  బాబుకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. వెంటనే నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఐఆర్‌సిఎస్‌పై ఫిర్యాదు చేశారు,  బ్లడ్ బ్యాంక్ నిర్లక్ష్యంపై విచారణ చేపట్టాలని బాబు తల్లిదండ్రులు కోరారు.

బాలుడు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు మొదలు పెట్టారు. బ్లడ్ బ్యాంక్ వైద్యుల నిర్లక్ష్యానికి పాల్పడిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని నల్లకుంట పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎం.రవి తెలిపారు. “ఐఆర్‌సిఎస్ అధికారులు తమ వద్ద రక్తదాతల రికార్డులు ఉన్నాయని, వారిని ధృవీకరణ కోసం పిలిపించవచ్చని తమ దగ్గర రక్త మార్పిడి సమయంలో ఎటువంటి లోపం జరగలేదని వాదిస్తున్నారని  రవి తెలిపారు. అయినప్పటికీ ఈ కేసు విషయంలో వైద్య నిపుణుల సలహాతో పాటు న్యాయ సలహా తీసుకుంటున్నామని చెప్పారు.

అంతేకాదు పోలీసులు మెడికల్ బోర్డు అభిప్రాయాన్ని కోరుతూ, రోగి రికార్డులను సమర్పించాలని బ్లడ్ బ్యాంక్ యాజమాన్యానికి లేఖ రాశారు.
“రెండున్నర సంవత్సరాలుగా బాలుడు IRCSలో రక్తమార్పిడి చేయిస్తున్నామని..  మరే ఇతర బ్లడ్ బ్యాంక్‌కు తీసుకెళ్లలేదని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

ఒక్క హైదరాబాద్ లోనే కాదు మహారాష్ట్రలో కూడా ఇదే విధమైన కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలోని నాగపూర్‌లోనూ తలసేమియాతో బాధపడుతున్న నలుగురు చిన్నారులకు హెచ్ఐవీ సోకినట్లు తేలింది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. వెంటనే  మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu