హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అప్పటి వరకు బానుడి భగభగలతో అల్లాడిన నగర వాసులపై చిరుజల్లులు కురిశాయి. దీంతో నగరవాసులకు ఎండ నుంచి ఊరట కలిగినట్లైంది. ఖైరతాబాద్, జూబ్లీహీల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్, అమీర్‌పేట్‌తో సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. భాగ్యనగరంలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది.
విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదగా ద్రోణి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న 5 రోజుల పాటుతేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కొముర్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెల్పింది. పలు ప్రాంతాల్లో సోమవారం పొడి వాతావరణం ఉంటుందని, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెల్పింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.