హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
కృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ ఆలయం వద్ద సెప్టెంబర్ 4న తెల్లవారుజాము 4 గంటల నుంచి సెప్టెంబర్ 5 అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా పలు మార్గాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు.

కృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్‌లోని అబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని సెప్టెంబర్ 4న ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు, దారి మళ్లింపులు ప్రకటించారు.
తెల్లవారుజాము నుంచే ఆంక్షలు
సెప్టెంబర్ 4న ఉదయం 4 గంటల నుంచి సెప్టెంబర్ 5 తెల్లవారుజామున 1 గంట వరకు, భక్తుల రద్దీని బట్టి అబిడ్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ కొనసాగనుంది. యూసుఫ్ అండ్ కంపెనీ, జవహర్‌లాల్ నెహ్రూ రోడ్, అబిడ్స్ సర్కిల్, పాత హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం, చిరాగ్ అలీ లేన్, నాంపల్లి స్టేషన్ రోడ్ మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
వాహనాల దారి మళ్లింపు
గన్‌ఫౌండ్రీ, తిలక్ రోడ్ జంక్షన్ నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు వచ్చే వాహనాలను జీపీవో జంక్షన్ వద్ద నియంత్రించి, అవసరమైతే ఎంజే మార్కెట్ వైపు మళ్లించనున్నారు. జాంబాగ్ రోడ్, ఎస్‌ఏ బజార్ వైపు నుంచి వచ్చే వాహనాలను కూడా రద్దీని బట్టి ఎంజే మార్కెట్, గాంధీభవన్, చాపెల్ రోడ్ వైపు మళ్లిస్తారు.
భక్తులకు ప్రత్యేక పార్కింగ్
ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులను కూడా ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపనున్నారు. అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.
