AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chadarghat Bridge: ప్రమాదం అంచున చాదర్ ఘాట్ బ్రిడ్జి.. తీవ్ర భయాందోళనలో నగరవాసులు..!

చారిత్రాత్మక చాదర్‌ఘాట్‌ బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉంది. ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన బ్రిడ్జి స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. బ్రిడ్జిపై ఉన్న రిటైనింగ్ వాల్ రెండు వైపులా కొంత భాగం విరిగిపోయి ప్రమాదం అంచుకు చేరింది. ఏ క్షణాన ఏం జరగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.

Chadarghat Bridge: ప్రమాదం అంచున చాదర్ ఘాట్ బ్రిడ్జి.. తీవ్ర భయాందోళనలో నగరవాసులు..!
Chadarghat Bridge
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Aug 04, 2024 | 11:02 PM

Share

చారిత్రాత్మక చాదర్‌ఘాట్‌ బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉంది. ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన బ్రిడ్జి స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. బ్రిడ్జిపై ఉన్న రిటైనింగ్ వాల్ రెండు వైపులా కొంత భాగం విరిగిపోయి ప్రమాదం అంచుకు చేరింది. ఏ క్షణాన ఏం జరగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.

హైదరాబాద్ మహానగరం గుండా ప్రవహించే మూసీ నదిపై 1831లో జేమ్స్‌ ఓలిఫాంట్‌ పేరుతో ఈ వంతెనను నిర్మించారు. ఈ ప్రాంతంలో వివిధ రకాల వ్యాపార సముదాయాలు, ఇళ్ళు, పాఠశాలలు ఉండటంతో నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటుంది. చాదర్‌ఘాట్‌ ప్రధాన రహదారికి మాజీ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ పేరును పెట్టారు. దీన్ని రాజేంద్రప్రసాద్‌ మార్గ్‌ అని కూడా పిలుస్తారు. మలక్‌పేట్, ఎల్బీనగర్, సంతోష్ నగర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్ మహానగరానికి రావాలంటే ఈ రహదారినే వినియోగిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఈ రహదారే ప్రధానం.

అయితే తాజాగా చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి రిటైనింగ్‌ వాల్‌ కొంత భాగం విరిగి పోయింది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన మరమ్మత్తు లు లేకపోవడంతో రిటైనింగ్‌ వాల్‌ శిథిలావస్థకు చేరుకుంది. ఈ వంతెన మీదుగా నిత్యం వేలాదిగా వాహనాలు, పాదచారులు ప్రయాణాలు చేస్తుంటారు. వంతెనకు ఇరువైపులా ఉన్న రిటైనింగ్‌ వాల్‌ పూర్తిగా దెబ్బతింది. అంతేకాకుండా కొంత భాగం విరిగిపోయింది. వాహనదారులు, ముఖ్యంగా పాదచారులు ఏ మాత్రం అదుపుతప్పినా బ్రిడ్జి కింద పడిపోయే ప్రమాదం పొంచి ఉంది.

ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ చాదర్ ఘాట్ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంటుంది. చాదర్‌ఘాట్‌కి అర కిలోమీటరులో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కూడా ఉంది. వందలాది బస్సులు ఈ వంతెన పైనుంచే వెళ్తుంటాయి. ఏదైనా జరిగితే పెద్ద ప్రమాదం జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి అధికారులు మరమ్మతులు చేయాలని హైదరాబాద్ నగరవాసులు కోరుతున్నారు.

ఇదిలావుంటే, చాదర్‌ఘాట్‌లో మూసీనదిపై కొత్త బ్రిడ్జిలను నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇంత వరకు పనులు ముందుకు సాగడం లేదు. మూసీ నది వరద ఉధృతికి దెబ్బతిన్న మూసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.52 కోట్లు, చాదర్‌ఘాట్ వంతెన కోసం 42 కోట్ల రూపాయలను గతంలోనే రాష్ట్ర సర్కార్ మంజూరు చేసింది. కానీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..