AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాలో తండ్రి.. ఇక్కడ ప్రియుడు.. రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. కట్‌చేస్తే యువతి..

ప్రేమ పేరుతో ఉన్మాదం.. కక్షతో చేసిన అరాచకం.. చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పెళ్లి నిరాకరించిందని హెచ్ఐవీ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన కిరాతకుడి చర్యకు, 24 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. రోగంతో కంటే ఆ అవమానం భరించలేక.. తనకేమవుతుందోనన్న భయంతో రమణి తీసుకున్న కఠిన నిర్ణయం తల్లిదండ్రులకు తీరని వేదనను మిగిల్చింది.

సినిమాలో తండ్రి.. ఇక్కడ ప్రియుడు.. రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. కట్‌చేస్తే యువతి..
Hyderabad Girl Takes Her Own Life
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 1:47 PM

Share

మనసు విరిగితే మనిషి తట్టుకోగలడేమో కానీ నమ్మిన వ్యక్తే ప్రాణాలు తీసేలా వ్యవహరిస్తే ఆ వేదన వర్ణనాతీతం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో జరిగిన ఒక యువతి ఆత్మహత్య ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రేమ నిరాకరించిందని కక్షగట్టిన ఓ యువకుడు చేసిన అమానుష చర్య, చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అన్నోజిగూడకు చెందిన 24 ఏళ్ల రమణి అనే యువతికి మనోహర్ అనే యువకుడితో పరిచయం ఉంది. అయితే పెళ్లి విషయంపై మనోహర్ తెచ్చిన ప్రతిపాదనను రమణి సున్నితంగా తిరస్కరించింది. ఈ క్రమంలో గత నెల 11న ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. తనను కాదన్నదన్న కోపంతో మనోహర్ అత్యంత కిరాతకానికి ఒడిగట్టాడు. యువతిపై దాడి చేయడమే కాకుండా ఆమె శరీరంలోకి హెచ్ఐవీ సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించినట్లు ఆరోపణలు వచ్చాయి.

మానసిక ఒత్తిడితో తనువు చాలించిన బాధితురాలు

ఈ భయంకరమైన ఘటన తర్వాత రమణి తీవ్ర భయాందోళనకు గురైంది. తన ఆరోగ్యానికి ఏమవుతుందోనన్న ఆందోళన, సమాజంలో ఎలా బతకాలన్న మానసిక ఒత్తిడి ఆమెను కుంగదీశాయి. అప్పటి నుండి ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా ఒంటరిగా ఉంటూ మానసిక వేదన అనుభవించింది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఘట్‌కేసర్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

పోలీసుల విచారణ – నిందితుడు జైల్లో..

బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అప్పట్లోనే కేసు నమోదు చేసిన పోలీసులు మనోహర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం నిందితుడు జైలులోనే ఉన్నాడు. అయితే యువతి ఆత్మహత్యతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. రమణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ రక్తం నిజంగానే హెచ్ఐవీ సోకినదా? లేక కేవలం భయపెట్టడానికే అలా చేశాడా? అన్న కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. చదువుకుని ఉన్నత స్థాయికి చేరుతుందనుకున్న కూతురు కళ్ల ముందే విగతజీవిగా పడి ఉండటం చూసి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.

Follow Us