AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad Bypoll: హుజూరాబాద్‌కు అమిత్‌ షా..? కేసీఆర్‌ సభకు ధీటుగా బీజేపీ ప్రచారం.. వేడెక్కుతున్న రాజకీయం..!

Huzurabad Bypoll: తెలంగాణలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఈ ఉప ఎన్నిక ప్రచారాన్ని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ధీటుగా..

Huzurabad Bypoll: హుజూరాబాద్‌కు అమిత్‌ షా..? కేసీఆర్‌ సభకు ధీటుగా బీజేపీ ప్రచారం.. వేడెక్కుతున్న రాజకీయం..!
Huzurabad Bypoll
Subhash Goud
|

Updated on: Oct 13, 2021 | 8:48 AM

Share

Huzurabad Bypoll: తెలంగాణలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఈ ఉప ఎన్నిక ప్రచారాన్ని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ధీటుగా హోరెత్తించాలని బీజేపీ నిర్ణయించింది. నువ్వా.. నేనా అన్నట్లు ప్రచారం జోరందుకుంటోంది. ఇక కేంద్ర హోశాఖ మంత్రి అమిత్‌ షా సభతో ఈ ప్రచారాన్ని ముగించాలని భావిస్తోంది కాషాయ దళం. అయితే వేయి మందికి మించి బహిరంగ సభ, ర్యాలీలు నిర్వహించవద్దని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ముందుగా అమిత్‌షా సభను రద్దు చేసుకున్నా.. తాజా పరిణామాలు చూస్తుంటే భారీగా సభ నిర్వహించాలని కమలం అగ్రనేతలు నిర్ణయించినట్లు సమాచారం.

ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నిక..

కాగా, ఈ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ అభ్యర్థి గెలుపునకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దని భావిస్తోంది బీజేపీ. హుజూరాబాద్‌లో తప్పకుండా బీజేపీ జెండా ఎగురవేయాలని బీజేపీ నాయకత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా అడుగులు వేస్తోంది రాష్ట్ర నాయకత్వం. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతోంది. టీఆర్‌ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీనే అనే సంకేతాన్ని ప్రజల్లో బలంగా వినిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

అమిత్‌ షా సభతో దద్దరిల్లాలి..

గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పలు పార్టీలు.. ఉప ఎన్నిక ప్రచారాన్ని మరింతగా వెడెక్కిస్తున్నాయి. కమలం నేతలు కూడా అమిత్‌షా సభ ఏర్పాటు చేసి ప్రచారానికి చెక్‌ పెట్టాలని అభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించే అవకాశాలుండటంతో అందుకు తగ్గట్లుగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు భారీ ఎత్తున అమిత్‌షా సభ నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అమిత్‌షాతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనేలా ప్లాన్‌ వేస్తున్నట్లు సమాచారం. అలాగే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారంలో విస్తృతంగా పాల్గొనేలా ప్రచారం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఉప ఎన్నిక ప్రచారానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈనెల 16 లేదా 17వ తేదీల్లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జోరుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా హుజూరాబాద్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.

ఇవీ కూడా చదవండి:

SingleVoteBJP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ‘‘ఒక్క ఓటు’’.. నెట్టింట్లో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు..

Political Story: గాంధీ పేరుతో బతకడం కోసం పాకులాట!