అర్థరాత్రి మాస్టర్ ప్లాన్.. సినిమాను తలపించిన చోరీ.. కారులో పరారైన దుండగులు..!
ఖమ్మం నగరంలో సంచలనం సృష్టించిన భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. జడ్పీ సెంటర్‌లో ఉన్న సోనోవిజన్ మొబైల్ స్టోర్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు తెల్లవారుఝామున భారీ దోపిడీకి పాల్పడ్డారు. సుమారు రూ.80 లక్షల విలువైన ఖరీదైన సెల్‌ఫోన్లను అపహరించి పరారైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు.

దొంగలు స్టోర్‌లోకి ప్రవేశించిన సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల అలారం మోగడంతో విజయవాడలోని సంస్థ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఖమ్మంలోని సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే దుండగులు తమ పని పూర్తి చేసుకుని కారులో అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు.
దుండగులను అడ్డుకునేందుకు సోనోవిజన్ సిబ్బంది తమ వాహనాన్ని కారుకు అడ్డంగా పెట్టినప్పటికీ, నిందితులు చాకచక్యంగా కారును వేగంగా నడిపి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన మొత్తం సినీ ఫక్కీలో జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న ఖమ్మం వన్‌టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీ వెనుక అంతర్రాష్ట్ర దొంగల ముఠా హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..