AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మబ్బులు చూసి ముంత ఒలకపోసుకోవద్దు.. తెలంగాణ రైతులకు IMD కీలక హెచ్చరిక

తెలంగాణలో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలను చూసి రైతులు తొందరపడి విత్తనాలు వేయొద్దని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కాకుండా ఉపరితల ఆవర్తనం కారణంగా నమోదవుతున్నవేనని తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..

మబ్బులు చూసి ముంత ఒలకపోసుకోవద్దు.. తెలంగాణ రైతులకు IMD కీలక హెచ్చరిక
Farmers
Ram Naramaneni
|

Updated on: Jun 11, 2026 | 10:03 AM

Share

తెలంగాణలో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలను చూసి రైతులు తొందరపడి విత్తనాలు వేయవద్దని భారత వాతావరణ శాఖ (IMD) కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, అవి ఇంకా పూర్తిస్థాయిలో విస్తరించకపోవడంతో వ్యవసాయ పనుల విషయంలో రైతులు మరికొన్ని రోజులు వేచి చూడాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న వర్షాలు నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కాదని, ఉపరితల ఆవర్తనం కారణంగా కురుస్తున్నవేనని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు గత నాలుగు రోజులుగా గద్వాల్, నారాయణపేట్ జిల్లాల పరిసర ప్రాంతాల్లోనే స్థిరంగా ఉండిపోయాయని తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత వర్షాలు కురిసే పరిస్థితి ఇంకా ఏర్పడలేదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను చూసి రైతులు నాట్లు, విత్తనాల విత్తే పనులు ప్రారంభించవద్దని ఐఎండీ హెచ్చరించింది. వరుసగా రెండు రోజుల పాటు కనీసం 30 నుంచి 40 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదై, నేల లోపలి పొరల వరకు తడిసినప్పుడే విత్తనాలు సక్రమంగా మొలకెత్తే అవకాశం ఉంటుందని తెలిపింది. తగినంత తేమ లేకుండా విత్తనాలు వేస్తే అవి ఎండిపోయే ప్రమాదం ఉందని సూచించింది. విస్తారంగా వర్షాలు కురిసే పరిస్థితికి రుతుపవనాలు ఇంకా అనుకూల స్థితికి చేరుకోలేదని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిన తర్వాత, నైరుతి రుతుపవనాలు మరింత బలపడి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఐఎండీ అంచనాల ప్రకారం మరో ఐదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా వ్యాపించే అవకాశముంది. ఆ తర్వాతే రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినప్పటికీ, వ్యవసాయ పనులను ప్రారంభించే విషయంలో రైతులు ఆచితూచి వ్యవహరించాలని, మరికొన్ని రోజులు పరిస్థితులను గమనించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

మొత్తంగా చూస్తే, ప్రస్తుతం కనిపిస్తున్న మేఘాలు, చిరుజల్లులను చూసి రైతులు తొందరపడకుండా, స్థిరమైన వర్షాలు నమోదైన తర్వాతే విత్తనాలు వేయడం మంచిదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రైతులు వాతావరణ అంచనాలను నిరంతరం పరిశీలిస్తూ వ్యవసాయ కార్యాచరణను ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

Follow Us