తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యాయి. ఎలాంటి ప్రయాణాలైనా వాయిదా వేసుకోవాలని.. కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంట్లోనే ఉండాలని, బయటకు రావొద్దంటూ IMD హెచ్చరించింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. 17 జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణ పేట, జోగులాంబ గద్వాల, జిల్లాలలో ఉరుములు, మెరుపులతో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. కొమరం భీమ్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది.. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన చేసింది. ఇదిలాఉంటే9.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. దీనిప్రభావంతో ఈదురు గాలులతో పాటు .. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్టయింది.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సీఎస్‌కు ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తుతున్న దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..