తెలంగాణపై చంద్రబాబుకు నిజంగా ప్రేమ ఉంటే.. ఆ లేఖ రాయాలి! హరీశ్ రావు డిమాండ్
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నిజంగా తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉంటే, కేంద్రానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం, పాలమూరు, దిండి వంటి ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుపడుతుందని, తెలంగాణకు జల కేటాయింపులలో అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. చంద్రబాబు గతంలో ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖలు రాశారని హరీష్ రావు గుర్తు చేశారు.

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. చంద్రబాబుకు నిజంగానే తెలంగాణపై ప్రేమ ఉంటే తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని కేంద్రానికి, సీడబ్యూసీకి లేఖ రాయాలని, గోదావరి మీద నిర్మిస్తున్న సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్, వార్థ, కాళేశ్వరం మూడవ ప్రాజెక్టుకి, అలాగే నల్గొండ జిల్లాలో డిండి ఎత్తిపోతల పథకానికి, కల్వకుర్తి, పాలమూరు ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల విషయంలో అభ్యంతరం లేదని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయాలి హరీశ్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఓ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివి అని, సమన్యాయం కోరుకుంటున్నాను అనడం హాస్యాస్పదం అంటూ హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అదే నిజమైతే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఎండబెట్టి, కుడి కాలువ నిండుగా నీళ్ళు తీసుకువెళ్లడం సమంజసమేనా, సమన్యాయమేనా? అని ప్రశ్నించారు.
ఖమ్మం, నల్గొండలో నీళ్ళు లేక పంటలు ఎండుతున్నాయని ఆ పాపం రేవంత్ రెడ్డి, ఆయన గురువు చంద్రబాబుది అని మండిపడ్డారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ కృష్ణా జలాల్లో ఏపీ 512 టీఎంసీల నీరు మాత్రమే వాడుకోవాల్సింది, ఇప్పటికే 657 టీఎంసీల నీరు వాడుకుంటున్నారని, తెలంగాణకు 343 టీఎంసీలు రావాల్సింది, 220 టీఎంసీలు మాత్రమే వచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేశారని, రేపటి రోజున తెలంగాణలో తాగునీటికి, సాగునీటికి తీవ్ర కరువు ఏర్పడనుందని ఇది సమన్యాయం ఎలా అవుతుందని మండిపడ్డారు. చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేయత్నం చేయలేదని అన్నారని, కానీ వాస్తవానికి 2018 జూన్ 13న ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కేంద్రానికి కాళేశ్వరానికి వ్యతిరేకంగా లేఖ రాశారని గుర్తు చేశారు. కాళేశ్వరం అనుమతులు రద్దు చేయాలని, ఆ ప్రాజెక్టు పనులు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరినట్లు హరీశ్ రావు తెలిపారు. చంద్రబాబు దత్తత తీసుకున్న జిల్లాల్లో పాలమూరు ప్రాజెక్టు, దిండి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను కూడా చంద్రబాబు వ్యతిరేకిస్తూ లేఖలు రాసినట్లు వెల్లడించారు.
గోదావరి బంకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడుతూ.. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటున్నామని అంటున్నారని, నిజానికి గోదావరి నీటిని పెన్నాకు తీసుకువెళ్లాడానికి ప్రయత్నిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు గోదావరి జలాల్లో 968 టీఎంసీలు రావాల్సి ఉండగా, వాస్తవానికి ఎన్నడు కూడా 200 టీఎంసీల నీటిని కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర నాయకులు ఇవ్వలేదని గుర్తు చేశారు. అందుకే 240 టీఎంసీల నీటికోసం కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ సాధించారని.. ప్రస్తుతం కాంగ్రెస్ నిర్లక్ష్యం వలన గోదావరిపై ఇంకా నిర్మించాల్సిన ప్రాజెక్టుల డీపీఆర్ లు వెనక్కి వస్తున్నాయని అని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే మనకు దక్కాల్సిన నీటిని పొరుగు రాష్ట్రాలు దోచుకుపోతాయని హచ్చరించారు. ఆయన నిజంగా రెండుకళ్ల సిద్ధాంతం, సమన్యాయం కోరుకుంటే వెంటనే తెలంగాణలోని ప్రాజెక్టులపై నో అబ్జెక్షన్ లెటర్ కేంద్రానికి రాయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




