ఆ మహిళ తన అమ్మ మాట వినకుండా ప్రేమించి పెళ్లిచేసుకోవడమే పాపమైంది. ఆ కోపాన్ని ఆమె అస్సలు జీర్ణించుకోలేపోయింది. అవకాశం కోసం చూసిన ఆమె.. కూతురుకు పుట్టిన 28 రోజుల పసిబిడ్డను నేలకేసి కొట్టి చంపింది. ఈ దారుణ ఘటన తెలంగాణ సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేటకు చెందిన సత్తగారి సూర్యకళకు భర్త లేడు. కూలీ పనులు చేసుకుంటూ బిడ్డలను పోషించుకుంటోంది. ఈ క్రమంలో ఎదిగిన కూతురు మౌనిక రెండేళ్ల క్రితం నర్సింలు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మౌనిక- నర్సింలు ఇద్దరూ బతుకు బాటలో చిన్నా చితక పనులు చేస్తుండేవాళ్లు. ఉన్నంతలో సంతోషంగానే ఉండేవాళ్లు. అయితే.. సాఫీగా సాగిపోతున్న వాళ్ల కాపురంలో ఒక్కసారిగా విషాదం.. ఆమె 8 నెలల గర్బిణీగా వున్న టైమ్‌లో భర్త నర్సింలు అర్ధాంతరంగా చనిపోయాడు. గత్యంతరంలేని పరిస్థితుల్లో ఆమె పుట్టింటికి చేరింది. కష్టాల్లో వున్న బిడ్డకు పుట్టింటివాళ్లు అండగా వుంటారు. కానీ ఆమెకు బంధువులే రాబందుల్లా మారారు. ఇరుగుపొరుగు సాయంతో హాస్పిటల్‌కు వెళ్తున్న క్రమంలో డెలవరీ జరిగింది. స్థానికులే సాయంగా నిలిచారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ క్రమంలో మౌనిక బిడ్డతో కలిసి పుట్టింటికి చేరింది. ఆదరించాల్సిన అమ్మమ్మ.. పసిగుడ్డుపై తన ప్రతాపం చూపింది. ఆదివారం కూతురితో గొడవ పడిన సూర్యకళ.. తాగిన మైకంలో పసిబిడ్డను నేలకోసి కొట్టింది. తేరుకునేలోపే చిన్నారి చనిపోయాడు. మౌనిక ఫిర్యాదుతో సదాశివపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు సూర్యకళను అదుపులోకి తీసుకున్నారు.
పసిబిడ్డను పొట్టన పెట్టుకున్న అమ్మమ్మ అమానుషం సదాశివపేటలో కలకలం రేపింది. ఒంటరి జీవితం గడుపుతున్న మౌనికకు.. బిడ్డ మరణం మరింత ఆవేదనను మిగిల్చింది. గుండెలవిసేలా రోదిస్తున్న మౌనికను చూసి స్థానికులు కంటతడి పెట్టారు. నిందితురాల్ని కఠినంగా శిక్షించడం సహా మౌనికను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..