Telangana: బీజేపీ కొత్త అధ్యక్షుడికి వింత సమస్య.. ఆఫీస్‌కు వెళ్తున్నా అటు వైపు కన్నెత్తి చూడని కిషన్ రెడ్డి.. !
తెలంగాణ బిజెపి కొత్త అధ్యక్షుడిగా ప్రకటించబడ్డ జీ.కిషన్ రెడ్డికి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పార్టీ రాష్ట్ర సారధ్య బాధ్యతలను అయిష్టంగానే కిషన్ రెడ్డి అంగీకరించినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయినా పార్టీ కోసం అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధమైన ఆయనకు విపరీతమైన పని ఒత్తిడి ఉంది కానీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి మాత్రం ఆయనకు..

తెలంగాణ బిజెపి కొత్త అధ్యక్షుడిగా ప్రకటించబడ్డ జీ.కిషన్ రెడ్డికి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పార్టీ రాష్ట్ర సారధ్య బాధ్యతలను అయిష్టంగానే కిషన్ రెడ్డి అంగీకరించినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయినా పార్టీ కోసం అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధమైన ఆయనకు విపరీతమైన పని ఒత్తిడి ఉంది కానీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి మాత్రం ఆయనకు వింత సమస్య అడ్డుస్తోంది. కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటించి ఇప్పటికి వారం రోజులైంది కానీ ఆయన ఇప్పటివరకు అధ్యక్ష పదవి బాధ్యతలను పార్టీ కార్యాలయంలో తీసుకోలేదు. ఈ నెల 18 వరకు ఆషాడ మాసం ఉండడంతో అప్పటివరకు అధ్యక్ష బాధ్యతలు అధికారికంగా చేపట్టడానికి కిషన్ రెడ్డి ఇష్టపడటం లేదు. ఆషాడమాసం పూర్తయిన తర్వాత ఒక మంచి ముహూర్తాన ఆయన బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్ష బాధ్యత చేపట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకోక పోయినా.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన రోజూ బిజెపి కార్యాలయంలో అనేక కీలక సమావేశాలు నిర్వహించాల్సి వస్తోంది. వాస్తవానికి అధ్యక్ష బాధ్యతలు తీసుకోకుండా బీజేపీ కార్యాలయానికి రావడం కూడా కిషన్ రెడ్డికి ఇష్టం లేదట.. కానీ ఇటీవల జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనకు రావడం, ప్రకాష్ జవదేకర్ సమావేశాల నిర్వహించడంతో ఆయన అనివార్యంగా పార్టీ కార్యాలయానికి రావాల్సి వచ్చింది. అప్పటినుంచి వాళ్లు లేకపోయినా కానీ కిషన్ రెడ్డి బిజెపి రాష్ట్ర కార్యాలయానికైతే వస్తున్నారు. అయతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చాంబర్ వైపు మాత్రం వెళ్లకుండా అందరూ కూర్చునే సమావేశ మందిరాల్లోనే కూర్చుంటున్నారు.
ఈ నెలలో కిషన్ రెడ్డి విదేశీ పర్యటనలు ఉన్నాయి. తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే మంచి ముహూర్తం చూసుకొని రాష్ట్ర అధ్యక్షుడి ఛాంబర్‌లో కిషన్ రెడ్డి అడుగుపెట్టబోతున్నారు. రాష్ట్ర కార్యాలయానికి వస్తున్నా అధ్యక్షుడు గది వైపు మాత్రం కిషన్ రెడ్డి కన్నెత్తి చూడకపోవడం ఆసక్తికరంగా మారింది. ఆషాడంలో ఎలాంటి శుభ కార్యక్రమాలను చేయకూడదన్న నమ్మకం కారణంగా కిషన్ రెడ్డి ఈ వింత సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది.




మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..
