Telangana Polls 2023: మునుగోడులో వ్యూహం మార్చుతున్న BRS..! కన్ఫ్యూజన్‌లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించిన కూసుకుంట్ల ప్రభాకర్ అందరి దృష్టిని ఆకర్షించారు. అత్యవసరమైన సమయంలో పార్టీకి విజయాన్ని అందించినందుకు గూలాబీ పార్టీలో ఆయన పేరు మార్మోగిపోయింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా పరిగణించిన మునుగోడు ఉప ఎన్నికలో 10వేల ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ విజయం సాధించింది. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులకు ఈ విజయం కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగా.. ఈ ఓటమి బీజేపీ శ్రేణులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. వాస్తవానికి ఇక్కడి నుంచి టిక్కెట్ కోసం బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఆశావహులు పోటీ పడినా.. 2018 అసెంబ్లీ ఎన్నికలో ఓడిపోయినా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే ఉప ఎన్నోకలోను తిరిగి టిక్కెట్ కేటాయించిందిఆ పార్టీ అధిష్టానం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించిన కూసుకుంట్ల ప్రభాకర్ అందరి దృష్టిని ఆకర్షించారు. అత్యవసరమైన సమయంలో పార్టీకి విజయాన్ని అందించినందుకు గూలాబీ పార్టీలో ఆయన పేరు మార్మోగిపోయింది. ఇంకేం.. పార్టీ కష్టకాలంలో గెలిచి నిలిచిన తనకే వచ్చే అసెంబ్లీ ఎన్నిలకల్లోనూ మళ్లీ టిక్కెట్ వస్తుందని భావించిన కూసుంట్లకు ఈసారి ఝలక్ తప్పదు అనే ప్రచారం జోరందుకుంది. అసలు విషయం ఏంటో తెలియదు కానీ..వచ్చే ఎన్నికల్లో మునుగోడు బీఆర్ఎస్ టిక్కెట్ కూసుకుంట్లకు కాదన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడం లేదని సిట్టింగ్ ఎమ్మెల్యేకి అధిష్టానం ఇప్పటికే తేల్చిచెప్పిందంటూ సొంత పార్టీకి చెందిన మునుగోడు టిక్కెట్ ఆశావహులు తమ సన్నిహితుల దగ్గర ప్రచారం చేసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ తనకు రాదన్న ప్రచారం ఆ ఎమ్మెల్యే గుండెళ్లో గుబులు రేపుతోంది. ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియక ఫుల్ కన్ఫ్యూజన్‌లో పడిపోయారు.
మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చాలా ఏళ్లుగా మునుగోడు టిక్కెట్ ఆశిస్తున్నారు. తాజాగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కూడా మునుగోడు పై మనసు పడ్డట్టు తెలుస్తోంది. ఇక బిసి కమ్యూనిటీ నుండి కర్నాటి విద్యాసాగర్ కూడా టిక్కెట్ పై గంపెడు ఆశలు పెట్టుకొని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బిఆర్‌ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఏం చెప్పిందో తెలియదు కానీ.. రానున్న ఎన్నికల్లో టిక్కెట్ కట్ అనే ప్రచారం మాత్రం జోరందుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మునుగోడు రాజకీయం ఇలా ఉంటే.. అక్కడఈసారి టిక్కెట్ దక్కాల్సిందే అని బిసి వర్గానికి చెందిన చాల మంది నేతలు అధిష్టానం దగ్గర బీష్మించుకొని కూర్చున్నారు.
మొన్నటికి మొన్న ఉప ఎన్నికలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సా గౌడ్ మునుగోడు టిక్కెట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బీజేపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. అయితేా అదే సమయంలో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కూడా టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. అప్పటి నుండి కర్నె ప్రభాకర్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించడం లేదు. కానీ వచ్చే ఎన్నికల సమయానికి టిక్కెట్ కోరికను బలంగా వినిపించే అవకాశం లేకపోలేదు. ఎలాగూ ఎమ్మెల్సీ పదవి కూడా రెన్యూవల్ చెయ్యలేదు కాబట్టి టిక్కెట్ అయినా ఇస్తారు అనే ఆశలో ఉన్నట్టు తెలుస్తుంది. మంత్రి పదవి దక్కలేదు కాబట్టి తన వారసుడికి అయినా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి రాజకీయ అరంగేట్రానికి అవకాశం ఇవ్వాలని గులాబీ బాస్ కేసీఆర్ ని గట్టిగా కోరుతున్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మొత్తానికి ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా బిఆర్‌ఎస్ అధిష్టానం మునుగోడు టిక్కెట్ పై ఒక నిర్ణయానికి వస్తే గాని ఎవరికీ దక్కుతుంది అనే అంశం పై క్లారిటీ వచ్చేల లేదు.
-శ్రీధర్ ప్రసాద్, టీవీ9 తెలుగు
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..
