జగిత్యాల జిల్లా, సెప్టెంబర్ 20: ‘భౌతికంగా మమ్మల్ని వీడిపోయినా మా హృదయాల్లో మాత్రం నీవు చిరస్థాయిగా నిలిచిపోయావు మిత్రమా.. నిన్ను మృత్యువు తీసుకెళ్లింది కావచ్చు కానీ నీతో కలిసి తిరిగి సంపాదించుకున్న వేలాది జ్ఞాపకాలు మాత్రం మా హృదయాల్లో పదిలంగానే ఉన్నాయి’ అంటున్నారు మోహిన్ ఖాన్ ఫ్రెండ్స్. ‘నీ జీవితాన్ని శాసించిన మరణం మన స్నేహితపు తీపి గుర్తులను మాత్రం శాసించ లేకపోయింది. హితుడా ఓ స్నేహితుడా తుది శ్వాస వీడినా నీవు మాత్రం మా గుండెల్లో మాత్రం జీవించే ఉన్నావు’ అంటూ ఆ యువకులు చనిపోయిన తమ మిత్రుడికి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఇంతకీ ఎవరీ మోహిన్ ఖాన్.. అసలేం జరిగింది..?
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన మోహిన్ ఖాన్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. తమతో కలివిడిగా ఉంటూ ఆడిపాడిన తమ చిన్ననాటి స్నేహితుడు కానరాని లోకానికి చేరినా అతని స్నేహితులు మాత్రం మోహిన్ ఖాన్ సాన్నిహిత్యపు మధుర జ్ఞాపకాలను మాత్రం వీడ లేకపోతున్నారు. రోడ్డు ప్రమాదం రూపంలో కబళించిన మోహిన్ ఖాన్ ఇంకా తమ మధ్యే తిరుగుతున్నాడని వారు భావిస్తూనే ఉన్నారు. మంగళవారం మోహిన్ ఖాన్ జన్మదిన కావడంతో భీమారం గ్రామంలో అతను బ్రతికున్నట్టుగానే వేడుకలను అతని స్నేహితులు అంతా కలిసి ఘనంగా నిర్వహించారు.
అలాగే గ్రామంలోని పలు చోట్ల మోహిన్ ఖాన్‌కు బర్త్ డే విషెస్ చెప్తూ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడంతో పాటు అతని సమాధిని అలంకరించి అక్కడే జన్మదిప ఉత్సవాన్ని కూడా జరిపించారు. బ్రతికున్న మనుషులనే తమవాళ్లు మర్చిపోతున్నట్టుగా నటిస్తూ జీవిస్తున్న ఈ కాలంలో చనిపోయిన తమ స్నేహితుడి బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిపించిన భీమారం యువత తమలోని మానవత్వాన్ని చేతల్లో ప్రదర్శించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..