నాలుగు తరాల వంశం.. 100 ఏళ్ల బామ్మ కోసం ఒక్క చోటకు చేరిన 150 మంది కుటుంబ సభ్యులు..
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామంలో కొరపోలు వంశానికి చెందిన నాలుగు తరాల కుటుంబ సభ్యులు ఒకేచోట చేరి ఆత్మీయంగా కలుసుకున్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన 150 మంది వంశీయులు తమ మూలాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు.

మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన మూలాలేంటి అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ.. ఒకే ఇంటి పేరు, ఒకే రక్తం పంచుకున్న 4 తరాల వారు ఒకే చోటుకు చేరుకున్నారు. ఎక్కడెక్కడో ఉన్నా, మన మూలం మాత్రం ఇదే అంటూ.. పెద్దలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామానికి చెందిన ఒక వంశం లోని నాలుగు తరాల కుటుంబ సభ్యులు ఒకేచోట కలుసుకున్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకేచోట కలుసుకోవడంతో అక్కడ పండగ వాతావరణం ఏర్పడింది. చెరువుమాధారం గ్రామానికి చెందిన కొరపోలు వెంకటేశ్వరరావు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన వంశీయులు ప్రస్తుతం 12వ తరానికి చేరారు. అలాగే, తొమ్మిదో తరంలో కొరపోలు రంగనాయకమ్మ మాత్రమే మిగిలారు. ఆమె ఆధ్వర్యంలో 10, 11, 12 తరాల వారు 150 మంది చెరువుమాధారం చేరుకున్నారు. వందేళ్ల బామ్మ నుంచి చిన్న పిల్లల వరకు కొరపోలు వంశీయులంతా ఒక చోటకు చేరి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియో చూడండి..
కాగా, వెంకటేశ్వరరావు ఉపాధ్యాయుడిగా పనిచేసిన సమయాన విద్యార్థులకు రామాయణం సులువుగా అర్థమయ్యేందుకు కొరపోలు రామాయణం పుస్తకాన్ని రచించారు.ఈ పుస్తకానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అందరూ కలుసుకుని ఆటపాటలతో సందడి చేశారు. వచ్చిన వారందరూ తమ వంశ చరిత్ర తెలుసుకుని గర్వపడ్డారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల మన బంధాలు బలపడతాయి అని యువత అభిప్రాయపడ్డారు.
సెల్‌ఫోన్లు, సోషల్ మీడియా పెరిగిన ఈ రోజుల్లో రక్త సంబంధాల మధురానుభూతులను గుర్తు చేసిన కొర్రిపోలు వంశీయుల ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయం. చెరువు మాదారంలో మొదలైన ఈ ఆత్మీయత ఇతర వంశాలకు కూడా దారిదీపంగా నిలుస్తుంది. వంశం అంటే వంశవృక్షం కాదు, అనుబంధాల వృక్షం అని ఈ సభ నిరూపించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
