అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్.. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు గులాబీ దళపతి బస్సుయాత్రకు సిద్ధమయ్యాడు. పార్లమెంట్ ఎన్నికల సమరానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో సమరశంఖం పూరించనున్నారు. కేసిఆర్ తెలంగాణ అంతటా తిరిగేందుకు పోరుబాటకు సర్వం సిద్ధమైంది. నేడు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుండి కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ప్రచార వ్యూహానికి పదును పెడుతోంది. ఇందు కోసం కేసీఆర్ బస్సు యాత్రను చేపడుతున్నారు. నేటి నుండి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సుయాత్ర కొనసాగనుంది. ఈ బస్సు యాత్ర నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుండి ప్రారంభం కానుంది. మిర్యాలగూడ నుండి పార్లమెంట్ ఎన్నికల సమరానికి శంఖం పూరించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ నుంచి100 వాహనాల భారీ కాన్వాయ్ తో కేసీఆర్ మిర్యాలగూడకు చేరుకుంటారు. మిర్యాలగూడలో సాయంత్రం 5.30 బస్సు యాత్ర ప్రారంభమై రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకోసం మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు భారీ ఏర్పాట్లు చేశారు. మిర్యాలగూడ నుండి వేములపల్లి, మాడుగుల పల్లి, తిప్పర్తి, నకిరేకల్ క్రాస్ రోడ్ మీదుగా సూర్యాపేటకు కెసిఆర్ బస్సు యాత్ర చేరుకుంటారు. రాత్రి 7 గంటల సమయంలో కేసీఆర్ సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించనున్నారు. కేసిఆర్ రాత్రి సూర్యాపేటలో బస చేయనున్నారు.
ఈ బస్సు యాత్ర 17 రోజుల పాటు 12 లోక్ సభ స్థానాల్లో రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీన సిద్ధిపేటలో ముగియనున్నది. ఈ పర్యటనలో కేవలం రోడ్ షోలకే పరిమితం కాకుండా కేసీఆర్ ఎక్కడికక్కడ ప్రజలతో మమేకం కానున్నారు. ఉదయం పూట రైతులు, మహిళలు, యువత, దళితులు, గిరిజనులు, మైనారిటీలు సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా భేటీలకు ఏర్పాట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వివరించడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గడతారు. పార్లమెంట్ ఎన్నికలవేళ బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం కెసిఆర్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు.
23 ఏళ్లలో ఉద్యమ నేతగా, ముఖ్యమంత్రిగా వందలాది బహిరంగ సభలు, వేలాది సమావేశాలు, రోడ్ షోలు తదితరాలతో కేసీఆర్ రాష్ట్రాన్ని చుట్టివచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నిర్వహించిన నల్లగొండ, కరీంనగర్, చేవెళ్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ‘పొలంబాట’ పేరిట బస్సుయాత్ర నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొనసాగే కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి ఏర్పాట్లును మాజీమంత్రి జగదీశ్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…