Telangana: చట్నీలో బల్లి.. తిన్న 8 మందికి వాంతులు, విరేచనాలు..
హోటళ్లలో తిండి తినాలంటేనే వినియోగదారులు భయపడే పరిస్థితి నెలకొంది. జగిత్యాలలోని ఓ టిఫిన్ సెంటర్‌లో చట్నీలో బల్లి అవశేషాలు కనిపించడంతో, అది గమనించకుండా తిన్న ఎనిమిది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనతో ఆహార భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడు హోటళ్లలో భోజనం చేయాలంటేనే వినియోగదారులకు భయమేస్తోంది. ఒకవైపు కల్తీ ఆహారం సమస్య ఉంటే, మరోవైపు ఆహారంలో పురుగులు, బొద్దింకలు వంటి అవశేషాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లాలోని ఓ హోటల్‌లో చట్నీలో ఏకంగా బల్లి అవశేషాలు కనిపించడంతో కలకలం రేగింది. ఇది గమనించకుండా తిన్న ఎనిమిది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.
జగిత్యాలలోని శివసాయి టిఫిన్ సెంటర్ సాధారణంగా వినియోగదారులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అయితే నాణ్యమైన ఆహారం అందించడం లేదన్న ఆరోపణలు ఈ హోటల్‌పై గతంలోనే ఉన్నాయి. అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పల్లీ చట్నీలో బల్లి పడిన విషయం వెలుగులోకి వచ్చింది. చట్నీలో బల్లి అవశేషాలు ఉన్నట్లు గమనించకుండా టిఫిన్ చేసిన ఎనిమిది మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. బల్లి అవశేషాల కారణంగానే వీరు అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు కూడా ధ్రువీకరించినట్లు సమాచారం. ఈ ఘటనతో హోటళ్లలో ఆహార భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇటీవలి కాలంలో పలు హోటళ్లలో నాణ్యమైన ఆహారం దొరకడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ, అపరిశుభ్రత పెరిగిపోయిందని ఆరోపిస్తున్నారు. చట్నీలో బల్లి పడిన ఘటన వినియోగదారులను మరింత భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో బయట హోటళ్లలో తినాలంటేనే ప్రజలు వెనుకంజ వేస్తున్నారు.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అధికారులు హోటల్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించి, యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. అయితే ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ల నిర్లక్ష్య వైఖరితోనే కొన్ని హోటళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. నాణ్యత లేని, అపరిశుభ్రమైన ఆహారం అందించే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే హోటళ్ల కిచెన్లు పరిశుభ్రంగా ఉండేలా తరచూ తనిఖీలు నిర్వహించాలని, ఫుడ్ సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నారు. చట్నీలో బల్లి పడిన ఆహారం తిని అనారోగ్యానికి గురైన బాధితులకు హోటల్ యాజమాన్యం తగిన నష్టపరిహారం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మొత్తానికి, ఈ ఒక్క హోటల్ మాత్రమే కాకుండా అనేక హోటళ్లలో శుభ్రత పాటించకుండా అపరిశుభ్రమైన ఆహారం అందించడం వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని జగిత్యాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి హోటళ్లలో శుభ్రత, నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
