Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: స్కూల్ నుంచి అలస్యంగా వచ్చాడని, 14ఏళ్ల కొడుకుని కొట్టి చంపి కన్న తండ్రి!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరేగూడెం గ్రామంలో దారుణం వెలుగు చూసింది. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి, గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాడు. ఇంతలోనే పోలీసుల ఎంట్రీతో అసలు విషయం బయటపడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Telangana: స్కూల్ నుంచి అలస్యంగా వచ్చాడని, 14ఏళ్ల కొడుకుని కొట్టి చంపి కన్న తండ్రి!
Father Beats Son To Death
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Feb 09, 2025 | 12:50 PM

పిల్లలను క్రమశిక్షణలో ఉంచేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం సామ దాన దండోపాయాలను అనుసరిస్తుంటారు. కానీ ఒక్కొక్కసారి అలాంటి పద్ధతులు వికటిస్తుంటాయి. అయితే మద్యం మత్తులో చేసిన పని వికటించి ఓ తండ్రి కడుపు కోతను మిగుల్చుకున్నాడు. మద్య మత్తులో కన్న కొడుకును ఎందుకు కడతేర్చాడో తెలుసుకోవాలంటే ఏ స్టోరీ చదవాల్సిందే..!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరేగూడెం గ్రామానికి చెందిన కట్టా సైదులు దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ముగ్గురు పిల్లలను ఉన్నంతలో తమ పిల్లలను చదివించి పెద్ద చేయాలని భావించారు. పిల్లలను తమ స్థాయికి మించి ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. అయితే కొంతకాలంగా తండ్రి సైదులు మద్యానికి బానిస అయ్యాడు. నిత్యం మద్యం తాగిస్తూ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు.

ఇదిలావుంటే చిన్న కొడుకు భాను(14) చౌటుప్పల్ లోని అన్న మెమోరియల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం(ఫిబ్రవరి 8) అన్న మెమోరియల్ స్కూల్ లో జరిగిన ఫేర్‌వెల్ పార్టీలో భాను కూడా పాల్గొన్నాడు. ఫేర్‌వెల్ పార్టీకి వెళ్లి రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు భాను. దీంతో మద్యం మత్తులో ఉన్న తండ్రి సైదులు ఆగ్రహంతో కొడుకు భానును చితకబాదాడు. భాను ఛాతిపై దెబ్బలు బలంగా తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. వెంటనే ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. భానును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని చెప్పారు.

పోస్టుమార్టం అవసరం లేదని మృత దేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు కూడా పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తాను కొట్టిన దెబ్బలకు కొడుకు చనిపోయిన విషయాన్ని ఎవరికి చెప్ప వద్దని భార్యను కూడా సైదులు బెదిరించాడు. తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా భాను మృతదేహాన్ని ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే, గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అంత్యక్రియలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది.

చివరికి భానును తండ్రి హతమార్చినట్లు నిర్థారించారు. పోలీసులు భాను మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మద్యం మత్తులో తన చిన్న కొడుకుని తండ్రి సైదులు కడ తీర్చడం, మద్యం మత్తుకు నిండు జీవితాన్ని బలి చేయడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.