Hyderabad: వారం రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. అదే ఇంట్లో నివసిస్తోన్న మతిస్థిమితంలేని సోదరుడు, తల్లి
ఓ మహిళ వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. మానసిక స్థితి బాగోలేని తల్లి, సోదరుడు ఆమె మృతి చెందిన విషయాన్ని గుర్తించలేకపోయారు. కుళ్లిపోయి, పురుగులు పడుతున్నా.. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుని సాధారణంగా ఉండసాగారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో గమనించిన ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహిళ మృతి విషయం బుధవారం (డిసెంబర్ 20)..

హైదరాబాద్, డిసెంబర్ 21: ఓ మహిళ వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. మానసిక స్థితి బాగోలేని తల్లి, సోదరుడు ఆమె మృతి చెందిన విషయాన్ని గుర్తించలేకపోయారు. కుళ్లిపోయి, పురుగులు పడుతున్నా.. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుని సాధారణంగా ఉండసాగారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో గమనించిన ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహిళ మృతి విషయం బుధవారం (డిసెంబర్ 20) వెలుగుచూసింది. స్థానికులను కలవరపాటుకు గురిచేసిన ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల ఠాణా పరిధిలోని చింతల్‌లో చోటుచేసుకుంది. స్థానిక ఇన్‌స్పెక్టర్ ఎం పవన్ తెలిపిన వివరాల ప్రకారం..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం వెంకటపురం గ్రామానికి చెందిన ముక్కు రాధాకుమారి (45), ఆమె తల్లి విజయలక్ష్మి, సోదరుడు పవన్ అయిదేళ్ల క్రితం నగరానికి వచ్చారు. వారు చింతల్‌లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. రాధాకుమారి వివాహం జరిగినా 20 ఏళ్ల క్రితం భర్త నంఉచి విడాకులు తీసుకుని తల్లి, తమ్ముడుతో కలిసి ఉంటోంది. అయితే గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా పరిస్థితి మెరుగుపడలేదు. రెండేళ్లుగా ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. రాధాకుమారి సోదరుడు ఓ ఫార్మా సంస్థలో పనిచేస్తూ.. మానసిక స్థితి బాగోలేని తల్లిని, సోదరినీ ఇద్దరినీ ఆయనే చూసుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్ మానసిక స్థితి కూడా క్షీణించడం మొదలు పెట్టింది. దీంతో రెండు నెలల క్రితం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో పవన్ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు.
వారం రోజుల క్రితం రాధాకుమారి ఆరోగ్యం క్షీణించి మృతి చెందినా.. తల్లిగానీ, సోదరుడు పవన్ గానీ గుర్తించలేకపోయారు. వారి పక్కింట్లో ఉండే యువకులు అప్పుడప్పుడు పవన్ ద్విచక్ర వాహనం తీసుకుంటూ ఉండేవారు. అలాగే వారు మంగళవారం రాత్రి ఇంటి తలుపు తట్టగా పవన్ తీశాడు. దీంతో ఒక్కసారిగా తీవ్ర దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా మంచంపై రాధాకుమారి మృతిచెంది కనిపించింది. మీ సోదరి చనిపోయిందని చెబుతున్నా.. పవన్ ఏమీ తెలియనట్లు వ్యవహరించాడు. దీంతో ఆ యువకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి మెయిన్ హాల్‌లో మంచంపై ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అదే ఇంట్లో నివసిస్తోన్న మృతురాలి తల్లి, సోదరుడిని ఈ విషయమై ప్రశ్నించగా ఆమె చనిపోయిందన్న విషయం తమకు తెలియదన్నారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా మృతురాలి తల్లి, సోదరుడి మానసిక స్థితి సరిగ్గాలేనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




